నవతెలంగాణ హైదరాబాద్: ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం.. సోమవారం విషమించడంతో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితమే మరణించినట్లు వార్తలు రాగా.. అప్పుడు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ధర్మేంద్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కుమార్తె ఎషా డియోల్ ప్రకటించారు. అనంతరం ఆయన కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా నిన్న రాత్రి నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో కటుంబ సభ్యులు, బందుమిత్రులు పెద్ద ఎత్తున ధర్మేంద్ర నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయకముందే దర్శకుడు కరణ్ జోహార్ ధర్మేంద్ర మరణాన్ని ధృవీకరిస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు.
ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో స్థానిక విల్లే పార్లీ శ్మశాన వాటికకు తరలించారు. ధర్మేంద్ర కన్నుమూశారన్న సమాచారం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు శ్మశాన వాటికకే తరలివచ్చి, నివాళులర్పించారు.



