నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ స్వగృహంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి చింతకుంట రత్నమ్మ (83) ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. కొన్ని రోజుల క్రితం ఆమెను కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని స్వగృహానికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3:39 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రత్నమ్మకు భర్త చింతకుంట మునుస్వామి నాయుడు, నలుగురు కుమారులు సీఎం సురేశ్, సీఎం రమేశ్, సీఎం ప్రకాశ్, సీఎం రాజు, ఇద్దరు కుమార్తెలు గుమ్మళ్ల మాధవి, పాటూరు విజయలక్ష్మి ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆమె అంతిమ సంస్కారాలను రేపు ఉదయం 11 గంటలకు స్వగ్రామం పోట్లదుర్తిలోనే నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రత్నమ్మ మృతి వార్త తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు, శ్రేయోభిలాషులు సీఎం రమేశ్‌కు ఫోన్ చేసి తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.


