Thursday, November 27, 2025
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగాన్ని రక్షించడమే కర్తవ్యం

రాజ్యాంగాన్ని రక్షించడమే కర్తవ్యం

- Advertisement -

లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ :
రాజ్యాంగం పేదలకు రక్షణ కవచమని, దానిని రక్షించడమే తన కర్తవ్యమని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌ సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. రాజ్యాంగంపై దాడిని అనుమతించబోమని ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. రాజ్యాంగంపై ఏదైనా దాడి జరిగితే ముందు నిలబడే వ్యక్తిని తానేనని అన్నారు. రాజ్యాంగం సురక్షితంగా ఉన్నంత వరకు ప్రతి భారతీయుడి హక్కులు సురక్షితంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ”భారత రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు. అది దేశంలోని ప్రతి పౌరుడు చేసిన పవిత్ర వాగ్దానం. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడినా, పేదలైనా, ధనికులైనా రాజ్యాంగం ద్వారా సమానత్వం, గౌరవం, న్యాయం పొందుతారు. రాజ్యాంగం పేదలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రతి పౌరుడి గొంతుకకు రక్షణ కవచం. అది సురక్షితంగా ఉన్నంత కాలం ప్రతి భారతీయుడి హక్కులు సురక్షితంగా ఉంటాయి. రాజ్యాంగంపై ఎటువంటి దాడిని అనుమతించ బోమని ప్రతిజ్ఞ చేద్దాం. రాజ్యాంగాన్ని రక్షించడం నా బాధ్యత” అని రాహుల్‌ గాంధీ తెలిపారు.

దేశ ప్రజలకు ఖర్గే శుభాకాంక్షలు
న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, పరస్పర సోదరభావం, లౌకికవాదం, సోషలిజం వంటి రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను రక్షించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రేమ, సోదరభావం, సామరస్యం కోసం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్వేచ్ఛను కాపాడుతానని అన్నారు. అలాగే దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌లో సుదీర్ఘమైన పోస్ట్‌ చేశారు.
”నేడు మనకు అత్యంత అవసరమైనది రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలైన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, పరస్పర సోదరభావం, లౌకికవాదం, సోషలిజంను రక్షించడం” అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌
మరోవైపు, రాజ్యాంగ దినోత్సవ వేళ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీపై కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేశ్‌ మండిపడ్డారు. రాజ్యాంగంపై దాడి చేసి దాన్ని అణగదొక్కడమే ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రని ఆరోపించారు. రాజ్యాంగం రూపకల్పనలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎటువంటి పాత్ర లేదని అన్నారు. ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్‌ షా రాజ్యాంగ సూత్రాలను తారుమారు చేస్తున్నారని విమర్శించారు.

దేశానికి రాజ్యాంగం వెన్నెముక : పశ్చిమ బెంగాల్‌ సీఎం
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగం అందించే మార్గదర్శకత్వాన్ని కాపాడు కోవాలని టీఎంసీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. భారతదేశ సంస్కృతులు, భాషలు, సమాజాల వైవిధ్యాన్ని అద్భుతంగా కలిపి ఉంచే రాజ్యాంగం దేశానికి వెన్నెముకని అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్‌లో మమత రాసుకొచ్చారు.
”దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదకర స్థితిలో ఉంది. సమాఖ్యవాదం అణచివేతకు గురవుతోంది. అందుకే ప్రజలు రాజ్యాంగం అందించే విలువైన మార్గదర్శకత్వాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగ దినోత్సవం నాడు దేశ రాజ్యాంగ రూపకల్పనలో భాగమైనవారికి, ముఖ్యమైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు నివాళులర్పిస్తున్నాను. రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన బెంగాల్‌కు చెందిన సభ్యులకు నివాళులు. మన రాజ్యాంగం దేశానికి వెన్నెముక అని నేను నమ్ముతున్నా. రాజ్యాంగం మన సంస్కతులు, భాషలు, సమాజ వైవిధ్యాన్ని అద్భుతంగా కలుపుతుంది” అని మమత అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -