Thursday, November 27, 2025
E-PAPER
Homeఆటలుఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై మహ్మద్ సిరాజ్ ఫైర్

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై మహ్మద్ సిరాజ్ ఫైర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గువాహ‌టి నుంచి హైదరాబాద్ రావలసిన తన విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై సోషల్ మీడియా వేదికగా అసహనం వెళ్లగక్కాడు. ఇది తన జీవితంలో ఎదురైన అత్యంత చెత్త అనుభవమని పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే… గువాహ‌టి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX 2884 రాత్రి 7:25 గంటలకు టేకాఫ్ అవ్వాల్సి ఉంది. అయితే, ఎలాంటి సరైన సమాచారం లేకుండా విమానాన్ని నాలుగు గంటల పాటు ఆలస్యం చేశారని సిరాజ్ ఆరోపించాడు. “ఫ్లైట్ నాలుగు గంటలు ఆలస్యమైనా ఇప్పటికీ ఎలాంటి అప్‌డేట్ లేదు. మమ్మల్ని ఇక్కడే వదిలేశారు.

ఇది నా జీవితంలో అత్యంత చెత్త విమానయాన అనుభవం” అని సిరాజ్ తన పోస్టులో రాసుకొచ్చాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 0-2 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. గువాహ‌టిలో జరిగిన రెండో టెస్టులో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత సిరాజ్ తన సొంత నగరం హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓటమితో ఇప్పటికే నిరాశలో ఉన్న సిరాజ్‌కు, విమానం ఆలస్యం మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. కాగా, నవంబర్ 30 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -