నవతెలంగాణ – హైదరాబాద్: నటి మంచు లక్ష్మి తన కుటుంబంలో ఎదురైన వివాదాలపై ఎమోషనల్‌గా స్పందించారు. సినిమా ప్రచారాల కోసం ఇచ్చే ఇంటర్వ్యూలు తప్ప, వ్యక్తిగత విషయాలని చర్చించడం కోసం తాను ఆసక్తి చూపబోనని స్పష్టం చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మంచు లక్ష్మి, తల్లి, సోదరి, కుమార్తెగా తన పాత్రల గురించి వివరించారు. “తల్లిగా నాకు నేను 10కి 10 మార్కులు ఇస్తాను” అని చెప్పి తన అనుభవాన్ని షేర్ చేశారు. ఇక కుటుంబంలో జరిగిన విభేదాల విషయం గురించి, ఆమె మాట్లాడుతూ .. దేవుడు ప్రత్యక్షమై ఒక వరం అడగమంటే, మా కుటుంబం మళ్లీ మునుపటిలాగే ఒక్కటిగా మారాలని మాత్రమే కోరతాను. ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. అయినా ఎంత విభేదాలు వచ్చినా చివరికి అందరూ కలిసే ఉండాలని మనసులో నిలుపుకోవాలి.
భారతీయ కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో, విరిగిపోయిన కలహాలు జీవితాంతం ఉండాలని భావించే ధోరణి ఉంది. అది సరికాదు. చివరికి మనకుండేది రక్తసంబంధీకులే. కుటుంబాన్ని కలిపేందుకు పోరాటం చేయాలి, దూరం పెంచుకోవడం సరైనది కాదు అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు. అలాగే, మంచు లక్ష్మి వ్యక్తిగత బాధలని బయటివాళ్లకు వివరించాల్సిన అవసరం లేదని చెప్పారు. “నేను ముంబయిలో ఉన్నాను. ఇక్కడి పరిస్థితులు తెలిసినా బాధపడలేదని కొందరు వార్తల్లో రాశారు. కానీ నా బాధ నాకు మాత్రమే తెలుసు. వివాదాలపై నేను మాట్లాడకపోవడం వల్ల కొందరు ఊహాగానాలు సృష్టించారు. నా కుటుంబం గురించి నేను అనుకున్నది, ఆ పరిస్థితుల్లో నాకు కలిగిన బాధ బయటివాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు.



