నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయ్యప్ప స్వాములు డీజీపీ ఆఫిస్‌ను ముట్టడించారు. అయ్యప్ప మాలతో ఆఫీసుకు రాకూడదంటూ ఇచ్చిన మెమోపై దీక్ష తీసుకున్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ కార్యాలయానికి వచ్చిన స్వాములు ఆఫీసులోనికి వెళ్లే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జీ చేశారని అయ్యప్ప స్వాములు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములు భారీ ర్యాలీతో డీజీపీ కార్యాలయం ముట్టడికి తరలిరావడంతో వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకోవలసి వచ్చింది. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా స్వాములు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో స్వాములకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో పోలీసులు కొందరు అయ్యప్పలను అరెస్టు చేశారు. అయ్యప్ప దీక్షాధారులకు పోలీస్ డ్రెస్ కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



