నవతెలంగాణ-హైదరాబాద్ : భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్, ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. తన సహచర క్రీడాకారిణి స్మృతి మంధాన కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు ఆమె భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె విజ్ఞప్తిని గౌరవిస్తున్నట్లు బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
పది రోజుల క్రితం హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం జెమీమా.. స్మృతి మంధాన వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చింది. అయితే, స్మృతి తండ్రి అనారోగ్యానికి గురికావడంతో పెళ్లి వాయిదా పడింది. ఈ క్లిష్ట సమయంలో స్మృతి కుటుంబానికి అండగా ఉండేందుకు జెమీమా భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఆమె నిర్ణయాన్ని తాము పూర్తిగా గౌరవిస్తున్నామని బ్రిస్బేన్ హీట్ యాజమాన్యం తెలిపింది.
ఈ విషయంపై బ్రిస్బేన్ హీట్ సీఈఓ టెర్రీ స్వెన్సన్ మాట్లాడుతూ… “జెమీమా ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందుకే ఆమె డబ్ల్యూబీబీఎల్‌కు తిరిగి రాకపోయినా, భారత్‌లో ఉండేందుకు మేం అంగీకరించాం. తిరిగి రాలేకపోతున్నందుకు జెమీమా కూడా నిరాశ వ్యక్తం చేసింది. క్లబ్‌కు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ, మిగతా మ్యాచ్‌లకు జట్టుకు శుభాకాంక్షలు చెప్పింది” అని వివరించారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని బ్రిస్బేన్ హీట్, శుక్రవారం అడిలైడ్ ఓవల్‌లో సిడ్నీ సిక్సర్స్‌తో తలపడనుంది. జెమీమా స్థానంలో ఆల్‌రౌండర్ గ్రేస్ హారిస్ తిరిగి జట్టులోకి రానుంది.



