నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన TasteAtlas తాజాగా విడుదల చేసిన టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్ జాబితాలో హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక స్థానం లభించింది. భారతదేశం నుండి ఈ జాబితాలో చోటుదక్కిన ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. హైదరాబాద్ బిర్యానీ నేరుగా టాప్ 10లో 10వ స్థానాన్ని సాధించడం ఇంకా దాని ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది.
ఈ జాబితాలో జపాన్ అత్యధిక వంటకాలతో నిలిచింది. అందులో ప్రముఖమైన Negitoro Don వంటకం ప్రపంచంలో నంబర్ 1 బెస్ట్ రైస్ డిష్ గా గుర్తింపు పొందింది. ఫ్యాటీ మిన్స్డ్ ట్యూనా (టోరో), కట్ చేసిన నెగి ఉల్లిపాయలు, వెచ్చని జపాన్ రైస్ పై సర్వ్ చేయడం దీని ప్రత్యేకత. అదేవిధంగా ఒటోరో నిగిరి సుషి, మాకి, అజి నిగిరి సుషి వంటి అనేక జపనీస్ వంటకాలు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఇక హైదరాబాద్ బిర్యానీ దేశంలోని ఇతర ప్రాంతాలలో తయారయ్యే బిర్యానీలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో మాంసం, బియ్యాన్ని మసాలాలతో కలిపి ఒకేసారి వండుతారు. దీనిని కచ్చి బిర్యానీగా పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన విధానమే దీని రుచికి మూలం అని ఫుడ్ గైడ్స్ చెబుతున్నాయి. ఇక మరో విధానం పక్కి బిర్యానీ. ఇందులో ముందుగా మసాలాలతో మాంసం వేరు, బియ్యం వేరు ఉడికించి, ఆ తర్వాత వాటిని పొరలుగా అమర్చిన తరువాత ‘దమ్’ మీద ఉంచి వండుతారు. ఈ విధానం కొద్ది సమయంలో సిద్ధమయ్యే తేడాతో పాటు బిర్యానీకి ప్రత్యేకమైన, స్పష్టమైన రుచులను ఇస్తుంది.



