– అశ్వారావుపేటలో శనివారం ఏర్పాటు
– వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
– కలెక్టర్ జితేష్ వి.పాటిల్
నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్‌సెల్,తలసేమియా దీర్ఘకాలిక రక్త వ్యాధుల తో బాధపడుతున్న రోగుల కోసం నవంబర్ 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు.
జిల్లాలోని ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.రోగుల ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించడం,అవసరమైతే నిరంతర చికిత్సకు అనుసంధానం చేయడం,కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశం అని కలెక్టర్ వెల్లడించారు.
ఇందులో భాగంగా 29 వ తేదీ శనివారం మండలంలోని అశ్వారావుపేటలో ఉదయం 8 గంటలకు,నారాయణపురం లో మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయా రైతు వేదికల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన గురువారం తెలిపారు.
ఇందుకోసం హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా రానున్న నిపుణులైన వైద్యుల బృందం ఈ శిబిరాల్లో రోగుల నిర్ధారణ, వైద్య సలహాలు,అవసరమైన చికిత్స పద్ధతులు వివరించనున్నారు. సికిల్‌సెల్, తలసేమియా రోగులకు మెడికల్ కార్డుల జారీ, ప్రత్యేక వైకల్యగుర్తింపు కార్డు, నమోదు,కౌన్సిలింగ్ సేవలు పూర్తిగా ఉచితంగా అందించ బడతాయని కలెక్టర్ తెలిపారు.
ఇప్పటికే ఈ వ్యాధులు గుర్తించిన పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను సమీప శిబిరానికి తీసుకురావాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్యుల సూచనలు పొందాలని కోరుతూ,రోగుల ఆరోగ్య రక్షణలో ప్రతి కుటుంబం చురుకైన పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు.



