నవతెలంగాణ-హైదరాబాద్: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించిన వేదికలు, తేదీలు ఖరారయ్యాయి. ఈ టోర్నమెంట్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు నవీ ముంబై, వడోదర నగరాల్లో జరగనుంది. గురువారం నాడు ఢిల్లీలో మెగా వేలం ప్రారంభానికి ముందు డబ్ల్యూపీఎల్ కమిటీ ఛైర్మన్ జయేష్ జార్జ్ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించారు. టోర్నీ ప్రారంభ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుండగా, ఫైనల్ పోరుకు వడోదరలోని కోటంబి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. వేలం జరిగే వేదిక వద్ద గురువారం మధ్యాహ్నం సమావేశమైన డబ్ల్యూపీఎల్ కమిటీ, ఈ తేదీలు, వేదికలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.
ఇటీవలే భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత జరుగుతున్న తొలి డబ్ల్యూపీఎల్ కావడంతో ఈ సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీలు… ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీలు మెగా వేలంలో బలమైన జట్లను నిర్మించుకోవడంపై దృష్టి సారించాయి. వేలం టేబుల్ వద్ద ముంబై ఇండియన్స్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులు హాజరయ్యారు.



