Friday, November 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం హాంకాంగ్ అగ్నిప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

 హాంకాంగ్ అగ్నిప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హాంకాంగ్‌లోని ఓ భారీ భవన సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటివరకు 83 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరో 76 మంది గాయపడగా, వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉంది. సుమారు 280 మంది ఆచూకీ తెలియకపోవడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భవన శిథిలాల్లో ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు.

థాయ్ పో జిల్లాలోని ఈ భవన సముదాయంలో మరమ్మతులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఏడు బ్లాకులకు మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రస్తుతం నాలుగింటిలో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, మిగిలిన మూడు భవనాల్లో ఇంకా అగ్నికీలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వందలాది మందిని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యల్లో 304 ఫైర్ ఇంజిన్లు, రెస్క్యూ వాహనాలు పాల్గొంటున్నాయి.

భవనానికి మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన వెదురు బొంగులు, గ్రీన్ మెష్ వల్ల ప్రమాద తీవ్రత పెరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కిటికీలకు అమర్చిన పాలిస్టరైన్ బోర్డులు అత్యంత సులభంగా మండే స్వభావం కలిగి ఉండటమే పెను విషాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. 1983లో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 4600 మంది నివసిస్తుండగా, వీరిలో 40 శాతం మంది 60 ఏళ్లు పైబడినవారే. గత 70 ఏళ్లలో హాంకాంగ్‌లో ఇంతటి ఘోర అగ్నిప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -