నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్‌లోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్, కంపెనీకి రూ.56.44 కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విషయంలో ఈ పెనాల్టీ విధించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లనున్నట్లు రిలయన్స్ స్పష్టం చేసింది.
ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. ఈ నెల 25న జారీ అయిన ఈ ఉత్తర్వులు, తమకు గురువారం ఉదయం 11:04 గంటలకు ఈ-మెయిల్ ద్వారా అందాయని కంపెనీ తెలిపింది. సెంట్రల్ జీఎస్టీ చట్టం, 2017లోని సెక్షన్ 74 కింద ఈ జరిమానా విధించారు.
అయితే, జీఎస్టీ అధికారుల నిర్ణయాన్ని రిలయన్స్ తప్పుబట్టింది. సేవల ప్రదాత (సర్వీస్ ప్రొవైడర్) అందించిన సేవల వర్గీకరణను పరిగణనలోకి తీసుకోకుండానే, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను బ్లాక్డ్ క్రెడిట్‌గా పరిగణించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. అందుకే ఈ ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది.



