నవతెలంగాణ-హైదరాబాద్: ప్రస్తుతం శ్రీలంక తీరప్రాంతం, దాన్ని ఆనుకని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దిత్వా తుఫాను’ వేగంగా కదులుతోంది. ఈ వారాంతంలో ఉత్తర తమిళనాడువైపుకి కదులుతోందని, దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎంసి) అంచనా వేసింది.
రామనాథపురం, తంజావూరు సహా ఐదు దక్షిన తీరప్రాంత, డెల్టా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫాను మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఆర్‌ఎంసి శుక్రవారం డెల్టా, దాని పరిసర జిల్లాలైన అరియలూర్, కడలూర్‌లకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది.
దిత్వా తుఫాను తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌కు దగ్గరగా కదులుతుందని , నవంబర్ 29,30 మరియు డిసెంబర్ 1 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది.
తమిళనాడు విపత్తు ప్రతిస్పందన దళం (టిడిఆర్‌ఎఫ్) చెందిన 30మంది సిబ్బంది శుక్రవారం తంజావూరుకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 30మంది టిఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది తిరువారూర్ చేరుకున్నారని అన్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని తంజావూరు కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా ఒడ్డుకు తిరిగి వచ్చారని తెలిపారు.



