నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతలో పర్యటించనున్నారు. వచ్చే నెల డిసెంబరు 4-5 తేదీల్లో ఆయన ఇండియాకు రానున్నారని సమాచారం. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. పుతిన్ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు భవన నిర్మాణం, జౌళి, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో 70వేల మందికి పైగా భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ మేరకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
2021 తర్వాత పుతిన్ భారత్‌కు రావడం మళ్లీ ఇప్పుడే. గతేడాది ప్రధాని మోదీ , పుతిన్ రెండుసార్లు భేటీ అయ్యారు. 2024 జులైలో ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ రష్యాకు వెళ్లారు. అదే ఏడాది అక్టోబర్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలోని కజాన్‌లో వీరిద్దరూ మరోసారి సమావేశమయ్యారు. ఇక, ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్-మోదీ భేటీ అయి పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే.



