– రేసులో శుభ్‌మన్, జశ్‌ప్రీత్ బుమ్రా
– సోమవారం భేటీ కానున్న సెలక్షన్ కమిటీ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వీడ్కోలుతో టెస్టు క్రికెట్‌లో అనూహ్యంగా తరం మార్పిడికి రంగం సిద్ధమవగా.. ఊహించని రిటైర్‌మెంట్ నిర్ణయాలతో సెలక్షన్ కమిటీ ముంగిట సరికొత్త సవాల్ నిలిచింది.
కోహ్లి, రోహిత్ స్థానంలో బ్యాటర్లను ఎంపిక చేయటంతో పాటు టెస్టు జట్టుకు కొత్త సారథిని ఎంపిక చేయాల్సి ఉంది. సోమవారం ముంబయిలో సమావేశం కానున్న సెలక్షన్ కమిటీ భారత టెస్టు క్రికెట్‌పై చర్చించనుంది!.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత్, ఇంగ్లాండ్ ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ఆరంభం కానుంది. భారత్-ఏ జట్టు ఈ నెలాఖరు నుంచే ఇంగ్లాండ్ పర్యటన షురూ కానుండా.. టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవటంతో బ్యాటింగ్ లైనప్‌లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. విరాట్ కోహ్లి, రోహిత్ స్థానంలో కొత్త బ్యాటర్లను ఎంపిక చేయటం, టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవటం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ముందున్న సవాళ్లు. మే 19న ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో భారత టెస్టు క్రికెట్ ఎదుర్కొంటున్న సవాళ్లను అజిత్ అగార్కర్ ప్యానల్ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.
నయా నాయకుడు ఎవరు?
టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్ ముందంజలో ఉన్నాడు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా సైతం రేసులో నిలువగా.. కెఎల్ రాహుల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. శుభ్‌మన్ గిల్ వయసు 25 ఏండ్లు. బ్యాటర్‌గా గిల్ ప్రతిభపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. సెలక్షన్ కమిటీ, సహాయక సిబ్బంది నుంచి మద్దతు ఉంది. విదేశీ గడ్డపై గిల్ బ్యాటింగ్ గణాంకాలు తీసికట్టుగానే ఉన్నప్పటకీ.. భవిష్యత్‌లో అతడు మంచి నాయకుడిగా ఎదుగుతాడనే నమ్మకం అందరిలోనూ కనిపిస్తోంది. మరోవైపు జశ్‌ప్రీత్ బుమ్రా.. నాయకుడిగా నిరూపించుకున్నాడు. 2022లో ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో తొలిసారి కెప్టెన్సీ వహించిన బుమ్రా.. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టుల్లో కెప్టెన్సీ చేపట్టాడు. ఒత్తిడి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న బుమ్రా ఇంగ్లాండ్ పర్యటనలో వరుసగా ఐదు టెస్టుల్లో ఆడకూడదని వైద్యులు సూచించారు. సెలక్షన్ కమిటీ మరో ఆప్షన్‌ను పరిశీలించే అవకాశం లేకపోలేదు. గిల్‌ను కెప్టెన్‌గా, పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించే ఆలోచన విరమించుకుని.. బుమ్రాకు సారథ్య పగ్గాలు అప్పగించి.. గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించటం. బుమ్రా విశ్రాంతి తీసుకున్న టెస్టులో గిల్ నేరుగా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడు, తదుపరి సారథిగా జట్టుపై అవగాహన పెంచుకునేందుకు వీలు చిక్కుతుంది.
రెండో ఓపెనర్ రేసులో..
కెఎల్ రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఓపెనర్‌గా విజయవంతం అయ్యాడు. రాహుల్ ఓపెనర్‌గా రాణించటంతో రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌కు పరిమితం అయ్యాడు. మిడిల్ ఆర్డర్‌లో అదనపు బ్యాటర్‌గా ఆసీస్‌కు వెళ్లిన రాహుల్ ఓపెనర్‌గా నిలదొక్కుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్‌లో రాహుల్‌ను ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ను సెలక్టర్లు చూస్తున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై రాహుల్‌కు మంచి అనుభవం ఉంది. 2018, 2021-22 పర్యటనల్లో రాహుల్ తొమ్మిది టెస్టులు ఆడాడు. 37.31 సగటు, రెండు సెంచరీలతో 597 పరుగులు సాధించాడు. అభిమన్యు ఈశ్వరన్, బి. సాయి సుదర్శన్ రూపంలో ఇద్దరు కొత్త ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌లో అభిమన్యు ఈశ్వరన్ (29)కు విశేష అనుభవం ఉంది. 100కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఆడిన అభిమన్యు గతంలో పలు సిరీస్‌లకు రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. అయినా, అభిమన్యు టెస్టుల్లో అరంగ్రేటం చేయలేదు. తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్ 2022లో ఫస్ట్ క్లాస్ అరంగ్రేటంలోనే సెంచరీతో సెలక్టర్లను ఆకర్షించాడు. ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లలో సాయి సుదర్శన్ ఒకడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఓపెనర్‌గా సాయి సుదర్శన్ 33 ఇన్నింగ్స్‌ల్లో 1397 పరుగులు చేయగా.. సగటు 42.33, నాలుగు సెంచరీలు బాదాడు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ ఇద్దరూ భారత్-ఏ తరఫున ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. అభిమన్యు ఈశ్వరన్‌కు కెప్టెన్సీ పగ్గాలు సైతం దక్కాయి.
నం.4 స్థానం ఎవరిది?
భారత టెస్టు జట్టులో నం.4 స్థానానికి అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం ఉండదని చతేశ్వర్ పుజారా అభిప్రాయం.2013లో సచిన్ టెండూల్కర్ వీడ్కోలు తీసుకున్న సమయంలో విరాట్ కోహ్లి ఆ స్థానం భర్తీ చేశాడు. అప్పటివరకు కోహ్లి నం.4 స్థానంలో ఆడలేదు. ఒక్కసారిగా నాల్గో స్థానంలో క్రీజులోకి వచ్చిన తర్వాత అదరగొట్టాడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు అనుభవం అవసరం లేదని కోహ్లి నిరూపించాడు. భారత జట్టులో భవిష్యత్ కోహ్లిగా పేరొందిన శుభ్‌మన్ గిల్ నం.4 స్థానాన్ని తీసుకుంటాడనే అంచనాలు ఉన్నాయి. గిల్‌తో పాటు రాహుల్ సైతం ఈ స్థానం రేసులో నిలిచారు. ఇంగ్లాండ్‌తో హైదరాబాద్ టెస్టుకు విరాట్ కోహ్లి దూరమవగా కెఎల్ రాహుల్ ఆ స్థానంలో వచ్చి 86, 22 పరుగులు చేశాడు. గిల్ ముందెన్నడూ నాల్గో స్థానంలో ఆడలేదు. భారత్-ఏ తరఫున మూడు ఇన్నింగ్స్‌ల్లో 287 పరుగులు చేశాడు. సగటు 143.50 కాగా అత్యధిక స్కోరు 204 నాటౌట్. కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే.. శుభ్‌మన్ గిల్ నాల్గో స్థానంలో రావచ్చు. సాయి సుదర్శన్ మూడో స్థానంలో ఆడేందుకు అవకాశం ఉంటుంది.
నితీశ్ రెడ్డికి అవకాశం ఉంటుందా?
2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ కుమార్ రెడ్డి గొప్పగా రాణించాడు. బంతితో నిరాశపరిచినా.. బ్యాట్‌తో మెల్‌బోర్న్‌లో మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాల్గో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి.. బ్యాట్‌తో మెరిసినా.. బంతితో తేలిపోయాడు. ఇంగ్లాండ్ పిచ్‌లు సీమ్‌కు అనుకూలిస్తాయి. ఈ పరిస్థితుల్లో నితీశ్ బంతితో మెరిస్తే టెస్టు జట్టులో అతడి చోటు పదిలమే. ఈ ఏడాది రంజీ ట్రోఫీ సహా గతంలో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన శార్దుల్ ఠాకూర్ రేసులోకి వచ్చాడు. భారత్-ఏ జట్టులో నిలిచిన శార్దుల్ ఠాకూర్‌కు ఇంగ్లాండ్ గడ్డపై మంచి గణాంకాలు ఉన్నాయి. భారత్-ఏ తరఫున రెండు వార్మప్ మ్యాచుల్లో నితీశ్, శార్దుల్ ప్రదర్శన కీలకం కానుంది. ఇద్దరిలో ఎవరు టెస్టు జట్టుకు ఎంపికైనా.. మరొకరు రిజర్వ్ ప్లేయర్‌గా నిలువనున్నారు.
పేస్ దళం పరిస్థితి ఏమిటీ?
భారత టెస్టు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పేస్ బౌలింగ్ ఒకటి. జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి పూర్తి ఫిట్‌నెస్‌తో లేరు. ఈ ఇద్దరు ఐదు టెస్టుల్లో ఆడలేరు. మహ్మద్ సిరాజ్ అందుబాటులో ఉన్నాడు, కానీ నిలకడ లేమి ప్రదర్శన అతడిపై అంచనాలు తగ్గేలా చేస్తోంది. ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, అర్షదీప్ సింగ్, యశ్ దయాల్ సహా హర్షిత్ రానాలు పేస్ విభాగలో చోటు కోసం పోటీపడుతున్నారు. బుమ్రా, షమిలకు విశ్రాంతి లభించనుండగా.. టెస్టు జట్టులో మరో ఇద్దరు పేసర్లను అదనంగా తీసుకునే వీలుంది.
కుల్దీప్ యాదవ్‌కు చోటుందా?
భారత క్రికెట్ బౌలింగ్ విభాగంలో జశ్‌ప్రీత్ బుమ్రాకు ఉన్న ప్రాధాన్యత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు సైతం ఉంటుంది. రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు తర్వాత భారత జట్టు తొలి విదేశీ పర్యటన ఇది. రవీంద్ర జడేజాతో పాటు మరో స్పిన్నర్‌ను ఎంపిక చేయనుండగా.. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ రేసులో ఉన్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్‌కు పిలుపు రాగా.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఆడాడు. ఆస్ట్రేలియాలోనూ మూడు టెస్టుల్లో సుందర్ ఆడినా.. బంతితో పెద్దగా బాధ్యతలు లేవు. హెర్నియా సర్జరీతో ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన కుల్దీప్ యాదవ్.. స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 4-1 విజయంలో కీలక పాత్ర పోషించాడు. 36.05 స్ట్రయిక్‌రేట్‌తో 19 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ స్ట్రయిక్‌రేట్ 36.11 కాగా.. రవీంద్ర జడేజా స్ట్రయిక్‌రేట్ 46.26. కుల్దీప్ యాదవ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ మ్యాచ్ విన్నర్‌గా నిలువగలడు. 2018 లార్డ్స్ టెస్టు అందుకు నిదర్శనం. సెలక్షన్ కమిటీ ఈ ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేస్తుందా.. ఒకరిని పక్కన పెడుతుందా? ఆసక్తికరం.
కొత్త కెప్టెన్ ఎవరు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES