నవతెలంగాణ-హైదరాబాద్ : నెల్లూరు నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యలు, గంజాయి వ్యాపారం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘లేడీ డాన్’ అరవ కామాక్షమ్మ నివాసాన్ని స్థానిక ప్రజలు పూర్తిగా ధ్వంసం చేశారు. సీపీఐ(ఎం) నేత పెంచలయ్య హత్య కేసులో ఆమె ఇటీవల అరెస్ట్ కావడంతో ఆగ్రహించిన స్థానికులు ఈ చర్యకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే, నెల్లూరులోని ఆర్డీటీ కాలనీలో నివాసముంటున్న అరవ కామాక్షమ్మ కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆమె గంజాయి వ్యాపారం చేయడంతో పాటు, నగరంలో పలు హత్యలను ప్రోత్సహిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) నేత పెంచలయ్య హత్య కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అయితే, ఆమె తిరిగి తమ ప్రాంతానికి రాకూడదని నిర్ణయించుకున్న స్థానికులు ఆమె ఇంటిపై దాడి చేసి కూల్చివేశారు. వందలాది మంది ఈ దాడిలో పాల్గొన్నారు. ఆమె ఇంటితో పాటు, ఆమెకు అనుచరులుగా వ్యవహరిస్తున్న వారి ఇళ్లను కూడా ధ్వంసం చేయడం గమనార్హం. తమ ప్రాంతంలో ఇలాంటి వారికి స్థానం లేదని స్థానికులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో ఆర్డీటీ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.



