నవతెలంగాణ-హైదరాబాద్: ఈక్వెడార్ జైలులో ప్రత్యర్థి గ్రూపుల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనలో తొమ్మిది మంది ఖైదీలు మరణించారు. పెరూ సరిహద్దుకు సమీపంలోని దక్షిణ ఈక్వెడార్‌లోని మచాలా జైలులో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఖైదీలు ఊపిరాడక మరణించారని, మృతుల్లో ఎనిమిది మందిని గుర్తించామని పోలీస్ వర్గాలు తెలిపాయి.
స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు డ్రోన్ ద్వారా పేలుడు పరికరాన్ని ప్రయోగించారని మీడియా తెలిపింది. పేలుడు ధాటికి భద్రతా సిబ్బంది అటువైపు వెళ్లగానే జైలు లోపల హింస చెలరేగినట్లు పేర్కొంది. భద్రతా సిబ్బంది తిరిగి జైలుకి చేరుకున్న తర్వాత .. భవనం మొదటి అంతస్తులో మృతదేహాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ మరణాల గురించి సోషల్‌మీడియాలో సమాచారం వ్యాప్తి చెందడంతో జైలు వెలుపల ఖైదీల కుటుంబసభ్యులు గుమిగూడారు. జైళ్లను నిర్వహించే రాష్ట్ర సంస్థ ‘నేషనల్ సర్వీస్ ఫర్ కాంప్రహెన్సివ్ అటెన్షన్ టు అడల్ట్స్ డిప్రైవ్డ్ ఆఫ్ లిబర్టీ అండ్ అడల్సెంట్ అఫెండర్స్ (ఎస్‌ఎన్‌ఎఐ) ‘ ఈ సమాచారాన్ని ధృవీకరించింది. అయితే అదనపు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.



