– ఆందోళన చేపట్టిన రైతులు
– దళారులకు అమ్మేందుకు మొగ్గు.
– లారీల కొరత ఉందంటూ నిర్వాహకులు సాకులు
నవతెలంగాణ-మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలోని పెద్దతూoడ్ల గ్రామానికి వేళ్ళు, ఓసిపి తోవ వద్ద తాడిచెర్ల పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కాంటాలు పెట్టడంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సకాలంలో కొనుగోలు చేయడం లేదంటూ సోమవారం ఉదయం బాధిత రైతులు కొనుగోలు కేంద్రంలో నిరసన,ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు ఆరుగాలం కష్టపడి,ఎన్నో ప్రయసాలకు ఓర్చులోని,వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామని పిఏసిఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోశామని తెలిపారు. కానీ ధాన్యం విక్రయించడంలో కళ్ళం నిర్వాహకులు ఆలస్యం చేస్తున్నట్లుగా వాపోయారు.కొనుగోళ్లలో ఆలస్యం కావడంతో ఒకవైపు మబ్బులు,చిరు జల్లులతో ప్రకృతి పగబడితే,మరోవైపు నిర్వాహకులు సకాలంలో తూకం వేయకపోవడంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ధాన్యం తూకం వేయడానికి గన్ని సంచులు ఇచ్చి వారం నుంచి రెండు వారాలు గడుస్తున్నా హమాలీలు కాంటాలు పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.లారీల కొరత ఉందంటూ నిర్వాహకులు కుంటి సాకులు చెబుతూ దాటవేయడంతో,పిఏసిఎస్ సిఈఓకు దృష్టికి తిసుకపోయిన ఫలితం లేదని వాపోయారు.ఇటు కొనుగోలు చేయక, అటు కారు మబ్బులకు భయాందోళనకు గురై కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని ప్రయివేటు దళారులకు అమ్మేందుకు ట్రాక్టర్లలో పోసుకొని పోతున్నామని చెబుతున్నారు.ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు మాత్రం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తూ కొనుగోళ్లలో వేగం పెంచాలంటూ నిర్వహకులను అదేశిస్తున్నారు.నిర్వాహకులు మాత్రం ఉన్నతాధికారులు ఆదేశాలు పెడచెవిన పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైతుల ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు వేగంగా కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు.
