నవతెలంగాణ-హైదరాబాద్: వారానికి 70 గంటలు పనిచేయాలంటూ పెట్టుబడిదారులు ఒకవైపు ఉపన్యాసాలిస్తుంటే,, సుదీర్ఘ పనిగంటలు, నిరంతర వేధింపులు, మేనేజర్ల ఒత్తిడి టెక్ ఉద్యోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల వరుస టెక్ ఉద్యోగుల ఆత్మహత్యలు కార్పోరేట్ పనిసంస్కృతి చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నాయి. విషపూరిత పనిసంస్కృతి, మేనేజర్ ఒత్తిడి కారణంగానే ఎఐ సంస్థకు చెందిన 25 ఏళ్ల మెషిన్ లెర్నింగ్ (ఎంఐ) ఇంజనీర్ నిఖిల్ సోమవంశీ ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. రెండువారాల క్రితం బెంగళూరులోని అగర సరస్సులో అతని మృతదేహాన్ని గుర్తించారు. సోమవారం అతని మృతిపై స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.
వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన సోమవంశీ.. 2024 ఆగస్ట్‌లో రైడ్-హెయిలింగ్ యాప్ ఓలా యాజమాన్యంలోని క్రుత్రిమ్ అనే ఎఐ కంపెనీలో ఎంఐ ఇంజనీర్‌గా చేరారు. పలువురు సహోద్యోగులు రాజీనామాలతో వారి పనిభారమంతా సోమవంశీపై పడటంతో తీవ్ర ఒత్తిడి పెరిగింది. అమెరికాకు చెందిన మేనేజర్ రాజ్‌కిరణ్ పానుగంటి ప్రవర్తన కారణంగా వారంతా రాజీనామా చేసినట్లు వెల్లడైంది. ఏప్రిల్ 8న సోమవంశీ తనకు విశ్రాంతి అవసరమని, తన మేనేజర్‌ను వ్యక్తిగత సెలవు మంజూరు చేయాలని కోరారు. తరువాత, ఏప్రిల్ 17న, తనకు మరింత విశ్రాంతి అవసరమని, అదనపు సెలవులు కోరడంతో సెలవులను పొడిగించినట్లు కంపెనీ ఇమెయిల్ ద్వారా నిర్థారణైంది. అయితే పని ఒత్తిడి, మేనేజర్ వేధింపులు తట్టుకోలేక అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
కంపెనీలో కొత్తగా చేరిన వారిపట్ల పానుగంటి బాధాకరమైన భాషను వినియోగిస్తారని, ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడంతో పలువురు రాజీనామాలు చేసినట్లు రెడిట్ పోస్ట్‌లో ‘కిర్గావాకుట్జో’ పేర్కొన్నారు. సోమవంశీ మరణవార్త తెలిసిన తర్వాత కూడా మేనేజర్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూనే ఉన్నారని పోస్ట్‌లో పేర్కొన్నారు. మేనేజర్ అనుచితంగా, దురుసుగా ప్రవర్తిస్తారని, జూనియర్ ఉద్యోగులను తక్కువ చేసి, అసమర్థులుగా ముద్ర వేస్తారని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు.
ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో 26 ఏళ్ల ఉద్యోగి అన్నా సెబాస్టియన్ గుండెపోటుతో మరణించారు. ఉద్యోగ ఒత్తిడి, అధిక పనిగంటలు గుండెపోటుకు కారణమని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. తన ఉన్నతాధికారులు, కార్యాలయంలోని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బజాజ్ ఫైనాన్స్‌కి చెందిన 42 ఏళ్ల ఉద్యోగి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.