నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా కప్ లో టీం ఇండియా పాల్గొనబోవడం లేదనే వార్తల్లో నిజం లేదని బీసీసీఐ బోర్డు సెక్రెటరీ దేవజిత్ సైకియాక్లారిటీ ఇచ్చారు. టీం ఇండియా ఆసియా కప్ 2025 లేదా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి తప్పుకుందని వచ్చిన వార్తలను ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమని, బీసీసీఐ ఇప్పటివరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈవెంట్‌ల గురించి ఎలాంటి చర్చలు జరపలేదని, ఏ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. బీసీసీఐ ప్రస్తుతం ఐపీఎల్ 2025, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌పై మాత్రమే దృష్టి సారించిందని.. ఆసియా కప్ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు.
పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో రాబోయే ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనబోవట్లేదని అధికారికంగా బీసీసీఐ ప్రకటించినట్లు ఓ వార్త షికారు చేసింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు తెలిపినట్లు ఆ వార్త సారాంశం. తాజాగా ఈ న్యూస్ పై బీసీసీఐ క్లారిటీ ఇవ్వడంతో అన్నిరకాల ఊహాగానాలకు తెరపడినట్లైంది.