నవతెలంగాణ హైదరాబాద్: దేశంలోనే తొలి ట్రాఫిక్ సిగ్నల్ రహిత నగరంగా రాజస్థాన్‌లోని కోటా నగరం అవతరించింది. 16 లక్షల జనాభా కలిగిన ఈ నగరంలో ట్రాఫిక్ జామ్‌లు ఉండవు. కోటా డెవలప్‌మెంట్ అథారిటీ (కేడీఏ) 2019లో ప్రారంభించిన ఈ ప్రణాళికలో భాగంగా ఆరు అండర్‌పాస్‌లు, ఏడు ఫ్లైఓవర్లు, 10కి పైగా కొత్త రహదారులు నిర్మించారు.
గోబారియా బావడి వద్ద ఒకే నిర్మాణంలో ఫ్లైఓవర్, అండర్‌పాస్ కలిపి ఏర్పాటు చేశారు. అనంతపురాలో ‘ఎస్’ ఆకారపు ఫ్లైఓవర్ నిర్మించారు. పండగలు, ర్యాలీలు, కీలక సమయాల్లో రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్‌వే మార్గాల్లో వాహనాలు ముందుకు కదిలేలా చర్యలు చేపడుతున్నారు. వీటన్నింటి ఫలితంగా వాహనాలు సాఫీగా ముందుకెళ్తున్నాయి. ప్రమాదాలు తగ్గి రహదారి భద్రత మెరుగుపడింది. కోటాను అనుసరిస్తూ ఇండోర్, బొకారో స్టీల్‌సిటీ వంటి నగరాలు సైతం సిగ్నల్ ఫ్రీ దిశగా పయనిస్తున్నాయి.
ప్రపంచంలో ఈ తరహా నగరాలు చాలా అరుదుగా ఉన్నాయి. భూటాన్‌లోని థింపూ నగరం అందులో ఒకటి. వృత్తాకార కూడళ్ల సాయంతో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. జంక్షన్‌లు రద్దీగా ఉన్న సమయాల్లో పోలీసులు ఇక్కడ నిలబడి వాహనాలను గైడ్ చేస్తారు. దీనివల్ల వాహనాలు సాఫీగా వెళ్తూ, ప్రమాదాలు తగ్గి రహదారి భద్రత మెరుగుపడింది.



