నవతెలంగాణ-హైదరాబాద్: జార్ఖండ్‌లో గత 24 గంటల్లో జరిగిన వేర్వేరు అడవి ఏనుగుల దాడి ఘటనల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మరణించినట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. రామ్‌గఢ్ జిల్లాలో, సిర్కా అటవీ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, రాంచీలోని అంగారాలోని జిదు గ్రామంలో ఒక వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో కొంతమందిని గుర్తించాల్సి వుందని అన్నారు. రామ్‌గఢ్ మరియు బొకారో జిల్లాల సరిహద్దు ప్రాంతాల వెంబడి విస్తరించిన అటవీ ప్రాంతంలో 42 ఏనుగులు గుంపులుగా తిరుగుతున్నాయని అన్నారు.
రెండు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్‌టిలు), అటవీ సిబ్బంది ఈ ప్రాంతంలో ఏనుగుల కదలికలను ట్రాక్ చేస్తున్నట్లు రామ్‌గఢ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి నితీష్ కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రామ్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో సెల్ఫీ వీడియో తీసేందుకు వెళ్లిన 32ఏళ్ల అమిత్ కుమార్‌పై అడవి ఏనుగుల గుంపు దాడి చేసిందని, ఈ దాడిలో అతను మరణించాడని చెప్పారు. ఏనుగుల గుంపు దాడి ఘటనలో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మరణించాడని, ఒక మహిళ సహా మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అంగారా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఆఫీసర్ తెలిపారు.



