నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులోని మదురైలో ఎల్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న అధికారులు నాలుగు అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలికి పంపి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఆ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా అధికారి మృతి చెందగా.. మరొకరు గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
రాత్రి 8.45 గంటలకు నగదు విత్ డ్రా చేసేందుకు ఏటీఎం వద్దకు వెళ్లిన సమయంలో భవనం పైఅంతస్తులో మంటలు ఎగసిపడుతున్నట్లు చూశానని ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. వెంటనే పైకి వెళ్లి అద్దాలు పగలగొట్టగా.. లోపలి నుంచి ఓ వ్యక్తి గాయాలతో బయటకు వచ్చాడని చెప్పారు. వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు కాల్ చేసి సమాచారం అందించానని తెలిపారు. పై అంతస్తులో మంటల్లో ఓ మహిళ చిక్కుకుపోయిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.



