Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం..నేటి నుంచి కొత్త నిబంధనలు

ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం..నేటి నుంచి కొత్త నిబంధనలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) స్టేజ్-4 ఆంక్షల్లో భాగంగా బీఎస్-6 ప్రమాణాలు లేని ఇంజిన్ వాహనాలు గురువారం నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో ఢిల్లీ సరిహద్దు నగరాలైన గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుంచి రోజూ రాకపోకలు సాగించే సుమారు 12 లక్షల వాహనాలపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. ఇందులో ఘజియాబాద్ నుంచి 5.5 లక్షలు, నోయిడా నుంచి 4 లక్షలు, గురుగావ్ నుంచి 2 లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా. ఈ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం 126 చెక్‌పోస్టుల వద్ద 580 మంది పోలీసు సిబ్బందిని, 37 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను మోహరించింది.

పెట్రోల్ బంకుల వద్ద పీయూసీ నిబంధనను పర్యవేక్షించేందుకు రవాణా, మున్సిపల్, ఆహార శాఖల అధికారులను నియమించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా పీయూసీ లేని వాహనాలను సులభంగా గుర్తించనున్నారు. శీతాకాలంలో ఢిల్లీ కాలుష్యంలో వాహనాల వాటా 25 శాతం వరకు ఉంటోందని అధ్యయనాలు తేల్చడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యక్ష తరగతులను నిలిపివేయగా, కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, బుధవారం సాయంత్రం ఢిల్లీ గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 334గా ‘చాలా పేలవం’ కేటగిరీలో నమోదైంది. ఇదే అంశంపై ఇవాళ లోక్‌సభలో చర్చ జరగనుండగా, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానం ఇవ్వనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -