నవతెలంగాణ-హైదరాబాద్: ‘రాజాసాబ్’ మూవీ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం సాయంత్రం జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. కేవలం ఫోటోలు, సెల్ఫీల కోసం హీరోయిన్ మీదకు ఎగబడటం, ఆమెను తాకడం, తోసేయడం వంటి పనులు చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిధి అగర్వాల్ ఎలాగోలా కారులోకి ఎక్కిన తర్వాత ‘ఓ మై గాడ్’ అంటూ షాక్‌లో కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ‘వీళ్లు మగాళ్లు కాదు, జంతువుల కంటే హీనంగా ప్రవర్తించే మృగాలు. ఇలాంటి వారిని ఈ గ్రహం మీద ఉంచకూడదు.. వేరే గ్రహానికి పంపేయాలి’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఇలా హీరోయిన్లను వేధించడం పట్ల ఆమె ఫైర్ అయ్యారు. సెలబ్రిటీల కంటూ ఒక ప్రైవసీ ఉంటుందని, వారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు.



