నవతెలంగాణ-హైదరాబాద్: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికపై కొత్త చర్చల కోసం అమెరికా మరియు రష్యా అధికారులు ఈ వారాంతంలో మయామిలో సమావేశం అవుతారని వైట్‌హౌస్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్‌లు అమెరికా ప్రతినిధులుగా చర్చల్లో పాల్గొంటారని, పుతిన్ ఆర్థిక రాయబారి కిరిల్ డిమిత్రివ్ రష్యన్ ప్రతినిధి బృందంలో ఉంటారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే వైట్‌హౌస్ ఈ వివరాలను నిర్థారించాల్సి వుంది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఇటీవలి వారాల్లో అంతర్జాతీయంగా దౌత్య చర్చలు జరుగుతున్నాయి. విట్కాఫ్ మరియు కుష్నర్ నవంబర్‌లో క్రెమ్లిన్‌లో పుతిన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఉక్రేనియన్లు మరియు యూరోపియన్ నేతలతో బెర్లిన్‌లో సమావేశమయ్యారు. అయితే చర్చలు ఫలించలేదు. భవిష్యత్తు భద్రతా హామీల విషయంలో పురోగతి ఉందని ఉక్రెయిన్ మరియు అమెరికా ప్రకటించాయి. ఉక్రెయిన్ ఏ భూభాగాన్ని వదులుకోవాల్సి వుంటుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తమ లక్ష్యాలను ‘కచ్చితంగా’ సాధిస్తుందని, వాటిలో భాగంగా తమ సొంతమని భావించే భూభాగాలను కూడా స్వాధీనం చేసుకోవడం కూడా ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం ఒక సమావేశంలో స్పష్టం చేశారు.



