Tuesday, May 20, 2025
Homeరాష్ట్రీయంరజకుల ఆత్మగౌరవ భవన స్థలంలో గుడిసెలు

రజకుల ఆత్మగౌరవ భవన స్థలంలో గుడిసెలు

- Advertisement -

– మేడిపల్లిలో బరితెగించిన కబ్జాదారులు
– ఎనుముల రేవంత్‌రెడ్డి నగర్‌ పేరుతో ఫ్లెక్సీ
– గుడిసెల వెనుక హస్తం నేత ?
– కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి : రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల అశయ్య
నవతెలంగాణ-బోడుప్పల్‌

కుల సంఘాలకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించిన రజకుల భవనం స్థలంలో రాత్రికి రాత్రే గుడిసెలు వెలిశాయి. ఎనుముల రేవంత్‌రెడ్డి నగర్‌గా పేరు కూడా పెట్టుకున్నారు. దీని వెనుక ఉన్న హస్తం నేత ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఆ స్థలాన్ని కబ్జా చేసి క్రమబద్ధీకరించుకోవాలని ప్రయత్నిం చగా కుదరకపోవడంతో కొత్త ఎత్తుగడకు తెరలేపారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండల పరిధిలోని మేడిపల్లి రెవెన్యూ 103 సర్వే నెంబరులో రజకుల ఆత్మగౌరవ భవనం కోసం 2018లో 2.20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబరు 20ను విడుదల చేసింది. అప్పటి నుంచి ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కానీ సదరు స్థలంపై కన్నేసిన కొందరు స్థానిక రాజకీయ నాయకులు సర్వే నెంబర్‌లో కొన్ని తప్పుడు పత్రాలతో నకిలీ పట్టాలు సృష్టించి పేదలకు అమ్ముకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. అక్కడే ఇప్పుడు గుడిసెలు వేయించారు.2023 కంటే ముందు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలోనే సదరు కబ్జాదారుడు ఆ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలని ప్లాన్‌ చేశాడు. ఆ తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో కాంగ్రెస్‌లో చేరిన సదరు నేత అవే పాత పట్టాలు తీసుకుని పార్టీకి చెందిన పెద్ద నేతల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టినట్టు తెలిసింది. అసలే పట్టాకు ఇంతా అని వసూళ్లు చేసిన ఆయనకు.. డబ్బులిచ్చిన వాళ్ళు ఒత్తిడి పెరగడంతో కొత్త నాటకానికి తెరలేపాడు..స్వయంగా ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్‌రెడ్డి నగర్‌ పేరిట కాలనీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి..సదరు నేత ఎవరికైతే అమ్ముకున్నాడో వారందరినీ ఉసిగొల్పి గుడిసెలు వేయించాడు. అంతేకాదు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యమంత్రి పేరుతో కాలనీ ఏర్పాటు చేస్తే అధికార పార్టీ నేతలు, అధికారులు ఎవరూ సప్పుడు చేయరు అనుకున్నాడో ఏమో ఏకంగా కబ్జా చేసిన స్థలానికి ఆదివారం రాత్రికి రాత్రే బోర్డు ఏర్పాటు చేసి గుడిసెలు వేయించాడు. విషయం తెలిసిన రెవెన్యూ అధికా రులు సోమవారం ఆ అక్రమ నిర్మాణాలను తొలగించారు.
నిర్మాణాలను తొలగించాం : మేడిపల్లి తహసీల్దారు హసీనా
మేడిపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 103లో రజక ఆత్మగౌరవ భవనం కోసం సర్కారు భూ కేటాయింపు చేసింది. ఈ భూమిలో కొందరు రద్దైన పట్టాలతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేశారు. నిర్మాణాల విషయం తమ దృష్టికి రాగానే రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కలిసి వెళ్లి తొలగించాం. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.
కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి :
రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
రజకుల ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించిన భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని కోరారు. గుడిసెలు వెలసిన ప్రాంతాన్ని సోమవారం సంఘం నేతలు సందర్శించారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో హసీనాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా కేటాయించిన స్థలంలో నిర్మాణం చేపట్ట లేదని అన్నారు. ఖాళీగా ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారని, అందులో భాగంగానే మే 18న రాత్రికి రాత్రే కబ్జాదారులు పేదలను ఉసిగొల్పి గుడిసెలు వేయించారని చెప్పారు. కొన్ని సిమెంట్‌ ఇటుకలతో గదులు కూడా కట్టారన్నారు. వాటిని పూర్తిగా తొలగించి.. కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో రజక వృత్తిదారుల సంఘం మేడ్చల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి ఉపేందర్‌, మేడిపల్లి మండల అధ్యక్షులు అంబె చక్రపాణి, సట్టు రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -