Sunday, December 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకొండెక్కిన కోడిగుడ్డు ధర..

కొండెక్కిన కోడిగుడ్డు ధర..

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : సామాన్యుడి పౌష్టికాహారమైన కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కొద్ది నెలల క్రితం రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ. 6 వరకు పలికిన ఒక్కో గుడ్డు ధర, ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లోనే గుడ్డు ధర రూ.7.30 పైగా పలుకుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కొద్ది రోజుల క్రితం వరకు 30 గుడ్లు ఉన్న ట్రే ధర రూ.160 నుంచి రూ.170 మధ్య ఉండగా, ఇప్పుడు హోల్‌సేల్‌లోనే రూ.210 నుంచి రూ.220కి పెరిగింది. మరోవైపు, నాటు కోడిగుడ్డు ధర ఒక్కొక్కటి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడమే ఈ ఆకస్మిక పెరుగుదలకు ప్రధాన కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగేది. అయితే, కోళ్లకు అవసరమైన దాణా, మక్కలు, చేపపొట్టు వంటి ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది రైతులు ఫారాల నిర్వహణను నిలిపివేశారు. దీంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.

“ప్రస్తుతం హోల్‌సేల్‌లో రూ.7.30, రిటైల్‌లో రూ.8 పలుకుతున్న ధర పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్ టైమ్ గరిష్ఠం. మరో రెండు నెలల పాటు ఇదే ధర కొనసాగే అవకాశం ఉంది” అని కోడిగుడ్ల వ్యాపారి ఒకరు తెలిపారు. ఉత్పత్తి సాధారణ స్థాయికి వచ్చే వరకు ధరలు తగ్గే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -