Thursday, December 25, 2025
E-PAPER
Homeజాతీయంజంక్ ఫుడ్ వల్లే విద్యార్థిని మృతి చెందిందా?..

జంక్ ఫుడ్ వల్లే విద్యార్థిని మృతి చెందిందా?..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన అహానా అనే 11వ తరగతి విద్యార్థిని ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె అతిగా జంక్ ఫుడ్ తినడం వల్లే పేగులు పాడైపోయి చనిపోయిందని కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు నిజాలను వెల్లడిస్తూ వైద్యులు ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.

అహానా మరణానికి జంక్ ఫుడ్ ప్రత్యక్ష కారణం కాదని ఎయిమ్స్ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె తీవ్రమైన టైఫాయిడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఈ నెల 19న ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఇన్ఫెక్షన్ ముదిరిపోవడంతో ఆమె పేగులకు రంధ్రాలు పడ్డాయి. దీనికి తోడు ఆమెకు క్షయ వ్యాధి కూడా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇలా ఒకేసారి పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం, చివరకు గుండెపోటు రావడంతో 21న ఆమె మృతి చెందింది.

అహానా బంధువు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ.. ఎయిమ్స్ వైద్యులు తమకు మరణానికి గల కారణాలను స్పష్టంగా వివరించారని, వారి చికిత్సపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. అయితే, అహానాకు చిన్నప్పటి నుంచి బయట ఆహారం తినే అలవాటు ఉందని, అదే ఆమె ఆరోగ్యం క్షీణించడానికి ఒక కారణమై ఉంటుందని తాము వ్యక్తిగతంగా నమ్ముతున్నామని ఆయన పేర్కొన్నారు. ఏ డాక్టర్ కూడా ‘జంక్ ఫుడ్ వల్లే మరణం’ అని రిపోర్టులో రాయలేదని ఆయన స్పష్టం చేశారు.

జంక్ ఫుడ్ తిన్నంత మాత్రాన పేగులు నేరుగా చిట్లిపోవని సర్ గంగారామ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పీయూష్ రంజన్ తెలిపారు. అయితే, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అతిగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం, ఊబకాయం, కాలేయ సమస్యలు, అజీర్తి వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని, కానీ ఇలాంటి ఆకస్మిక మరణాలకు జంక్ ఫుడ్‌ను నేరుగా బాధ్యులను చేయలేమని ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -