నవతెలంగాణ – హైదరాబాద్: ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, బిహార్‌కు చెందిన 14 ఏండ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ యువ సంచలనం, ఇప్పుడు చిన్నారులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’ అందుకోనున్నాడు.
ఢిల్లీలో ఈరోజు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించనున్నాడు. ఈ కార్యక్రమం కోసం బుధవారమే ఢిల్లీకి చేరుకున్న వైభవ్, అవార్డు ప్రదానోత్సవం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా భేటీ కానున్నాడు. క్రీడలు, ఇతర రంగాల్లో రాణిస్తున్న యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అతని అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది. అయితే, ఈ అవార్డు వేడుక కారణంగా అతను విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.



