నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టు వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఉన్నావో లైంగికదాడి కేసులో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దిప్ సింగ్ సెగార్‌కు జీవిత ఖైదు రద్దుతోపాటు బెయిల్ మంజూరు చేయడాన్ని బాధిత కుటుంబం,పలు సంఘాలకు చెందిన మహిళా నాయకురాలు ఖండించారు. శుక్రవారం కోర్టు ముందు బైటాయించి ఆందోళనకు దిగారు. వెంటనే ప్రధాన నిందితుడైన సెగార్ బెయిల్ రద్దు చేయాలని ప్లకార్డులను చేతబూని నినాదాలు చేశారు. అయితే అప్రమత్తమైన భద్రతా బలగాలు కోర్టు ఆవణలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని, జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ఆందోళన వ్యక్తం చేయాలని సూచించారు. లేకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. లైంగికదాడి ప్రధాన నిందితుడికి జారీ చేసిన బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని ఉన్నావ్ బాధితురాలి తల్లి మీడియా సమావేశంలో డిమాండ్ చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో న్యాయవ్యవస్థపై ఉన్ననమ్మకం పోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. సదురు న్యాయస్థానం నిర్ణయంతో తాము దేశ అత్యున్నత కోర్టును ఆశ్రయించామని, సుప్రీంలో తమకు సరైన న్యాయం లభించకుంటే, ఇండియాలో జీవించడం కష్టమని, భారత్ విడిచి వెళ్లిపోతామని మరో దేశం వెళ్తామని ఆమె వాపోయారు.
బాధితురాలి తరుపున శాంతియుతంగా ఢిల్లీ హైకోర్టు ముందు నిరసన తెలియజేస్తున్నామని, బాధితురాలికి న్యాయం లభించే వరకు తమ పోరాటం ఆగదని ప్రముఖ సామాజిక నాయకురాలు యోగితా భయాన హెచ్చరించారు. మరోవైపు ఉన్నావో బాధితురాలికి న్యాయం లభించాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడికి బెయిల్ మంజూరుపై మరోసారి పునర్ ఆలోచన చేయాలని సూచిస్తున్నాయి. అదే విధంగా రోజురోజుకు ఉన్నావ్ బాధితురాలికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే సీబీఐ కూడా సెగర్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. త్వరలోనే సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.



