నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని రాజరాజేశ్వరి నగర్ గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన కాల గంగాధర్ (66) మృతి చెందినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గంగాధర్ ను వెనక నుండి వచ్చిన షిఫ్ట్ డిజైర్ కారు ఢీ కొట్టింది. రోడ్డు ప్రమాదం వల్ల వచ్చిన శబ్దానికి పలువురు గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాల పాలైన గంగాధర్ ను ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ కోసం సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది గంగాధర్ ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకొని సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు మృతుడు గంగాధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి దానికి కారణమైన షిఫ్ట్ డిజైర్ కార్ నడిపిన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి సల్క దినేష్ పై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.



