Saturday, December 27, 2025
E-PAPER
Homeఆటలుఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ చారిత్రక విజయం..

ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ చారిత్రక విజయం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు, ఎట్టకేలకు పరువు నిలబెట్టుకుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టుపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచ్ గెలవడం కోసం దాదాపు 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఈ గెలుపుతో తెరపడింది. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్‌పై ఈ బాక్సింగ్ డే టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం లభించింది. జోష్ టంగ్ (5 వికెట్లు) దెబ్బకు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను ఆసీస్ బౌలర్లు దెబ్బతీశారు. నెసెర్, బోలాండ్ ధాటికి ఇంగ్లీష్ జట్టు 110 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియాకు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించారు. బ్రైడన్ కార్స్ (4/34), బెన్ స్టోక్స్ (3/24) అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లండ్ కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సులభమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్ డకెట్ (34), జాక్ క్రాలీ (37) దూకుడైన ఆరంభాన్ని ఇచ్చారు. మధ్యలో కొన్ని వికెట్లు కోల్పోయినా జాకబ్ బెథెల్ (40) సంయమనంతో ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకోగా, ఈ విజయంతో ఇంగ్లండ్ కు కాస్త ఊరట ల‌భించింది. ఆస్ట్రేలియాలో జో రూట్‌కు 18 టెస్టుల తర్వాత, బెన్ స్టోక్స్‌కు 13 టెస్టుల తర్వాత ఇదే తొలి విజయం. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు జనవరి 4న సిడ్నీలో ప్రారంభం కానుంది.

సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: తొలి ఇన్నింగ్స్: 152;  రెండో ఇన్నింగ్స్: 132
ఇంగ్లండ్: తొలి ఇన్నింగ్స్: 110;  రెండో ఇన్నింగ్స్: 178/6

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -