Wednesday, May 21, 2025
Homeప్రధాన వార్తలువిత్తనంపై ప్రయివేటుదే పెత్తనం

విత్తనంపై ప్రయివేటుదే పెత్తనం

- Advertisement -

– 80 శాతం ఉత్పత్తి కంపెనీలదే
– ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి
– మార్కెట్‌లో నాసిరకం సీడ్స్‌
– విత్తన రైతులకు ప్రోత్సాహం కరువు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అత్యంత కీలకమైన విత్తనాలపై ప్రయివేటు కంపెనీల పెత్తనం నడుస్తోంది. వానాకాలం సీజన్‌ సమీపిస్తున్న తరుణంలో మార్కెట్‌లోకి ఇబ్బడిముబ్బడిగా ఆయా కంపెనీల విత్తన ప్యాకెట్లు వచ్చిపడుతున్నాయి. దీంతో ఆయా కంపెనీలకు కాసుల వర్షం కురుస్తున్నది. రాష్ట్రంలో తెలంగాణ సీడ్‌ కార్పొరేషన్‌, వ్యవసాయ విశ్వ విద్యాలయం, నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ కలిపి కేవలం 20 శాతం మాత్రమే విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. అదే ప్రయివేటు కంపెనీలు మాత్రం 80 శాతం విత్తనాలను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున విత్తనాలు దిగుమతి అవుతు న్నాయి. మార్కెట్‌లోకి వస్తున్న విత్తనాల నాణ్యతతోపాటు నాసిరకం తదితర అంశాలను చెక్‌ చేయడంలో వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలమవుతున్నది. నాసిరకం విత్తనాలను విత్తడం వల్ల పంట ఏపుగా పెరగదు. పైగా దిగుబడి కూడా అంతంతే. ఆ దిశగా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ విత్తనోత్పత్తికి ప్లాన్‌ చేయకపోవడంతో కంపెనీలే పైచేయి సాధిస్తున్నాయి.
వరి ఉత్పత్తిలో ప్రథమం…విత్తన ఉత్పత్తితో అథమం
ధాన్యాన్ని ఉత్పత్తి చేయడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నది. ఆ విత్తనాన్ని ఉత్పత్తి చేయడంలో ప్రభుత్వం వెనుకబడింది. ఈ వానాకాలంలో 66.80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకు 16.70 లక్షల క్వింటాళ్ల వరి విత్తనం అవసరమని తేల్చింది. కానీ తెలంగాణ సీడ్‌ కార్పొరేషన్‌ సరఫరా చేస్తున్నది మాత్రం కేవలం 17,790 క్వింటాళ్లు మాత్రమే. నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా 9,500 క్వింటాళ్లు వస్తున్నది. మిగతా విత్తనాలను ప్రయివేటు కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం అవి 18.52 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచాయి. సన్నాల సాగు పెరుగుతున్న నేపథ్యంలో రైతు ప్రయివేటు సీడ్‌ కంపెనీల నుంచి అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం కూడా కేవలం 11,084 క్వింటాళ్ల విత్తనా లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నది. ఆ వర్శిటీ వరి, మొక్క జొన్న, మినుములు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పశుగ్రాసం విత్తనాలను అందిస్తున్నది. కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చిన తర్వాత గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులకు సర్టిఫైడ్‌ విత్తనాలను సరఫరా చేసే లక్ష్యంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది. 75 శాతం సబ్సిడీతో ప్రతి గ్రామంలో 25 నుంచి 150 మంది రైతులను ఈ పథకంలోకి తీసుకురానుంది. కానీ ఆ పథకం ఇంకా పట్టాలెక్కలేదు.
టామాటా విత్తనం కూడా
వరి, పత్తి విత్తనాలే కాకుండా చివరకు టామాటా విత్తనాన్ని కూడా ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, తమిళ నాడు, కర్నాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి టామాటా సీడ్‌ దిగుమతి అవు తున్నది. రాష్ట్రంలో టామాట పంటకు అనువైన నేలలు ఉన్నప్పటికీ రైతులకు ప్రో త్సాహం లేకపోవడం వల్ల విత్తనోత్పత్తి చేయలేకపోతున్నారు. కర్నాటక నుంచి కందులు, సోయా, మహారాష్ట్ర నుంచి పత్తి విత్తనాన్ని కొనుగోలు చేస్తున్నారు. పంట కాలనీలు ఏర్పాటు చేసి, ఆ రైతులకు భరోసా కల్పించడం ద్వారా విత్తనోత్పత్తి చేయ వచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సబ్సిడీతో రైతులకు సరిపడా విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
కాటన్‌ సీడ్‌ మాయాజాలం
పత్తిని తెల్లబంగారం అని కూడా అంటారు. అది వాణిజ్య పంటగా ప్రసిద్ధి చెందింది. వరి సాగు తర్వాత పత్తి సాగు రెండోస్థానంలో ఉంది. తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుంది. అందుకు 45 వేల క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసరం. ఈ క్రమంలో ప్రయివేటు కాటన్‌ సీడ్‌ కంపెనీలు ఇప్పటికే 1.34 లక్షల క్వింటాళ్లు అందుబాటులోకి తెచ్చాయి. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతున్నా… దాని విత్త నాల బాధ్యతను ప్రభుత్వం ప్రయి వేటు కంపెనీ లకే వదిలేసింది. సీజన్‌ వచ్చిదంటే చాలు ఆయా కంపెనీలు వేల కోట్లమేర విత్తన వ్యాపారం చేస్తున్నాయి. బీటీ-2 ప్యాకెట్‌ను రూ. 901 ధరకు అమ్ముతున్నారు. స్థానిక కంపెనీలే కాకుండా ఐదారు కార్పొరేట్‌ కంపెనీలే కాటన్‌ సీడ్‌పై పెత్తనం చెలాయిస్తున్నాయి. పత్తి విత్తనం ధర 2018లో రూ.710 ఉండగా, 2025లో రూ. 901కి చేరుకుంది. ఆయా కంపెనీలు ప్రతి ఏటా రెండు, మూడు శాతం ధరలను పెంచేస్తు న్నాయి. కాటన్‌ సీడ్‌ ధరలను నియంత్రించడం ప్రభు త్వానికి సవాల్‌గా మారింది. ఇదే క్రమంలో బీటీ-3 కాటన్‌ సీడ్‌ పేరిట రైతులను కంపెనీలు పెద్దఎత్తున మోసం చేస్తున్నాయి. ఈ విత్తనం నాటితే తెగుళ్లు రావనీ, కలుపు మందులు వేయాల్సిన అవసరం లేదంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. ఈ విత్తనాలు మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి రహస్యంగా దిగుమతి అవుతున్నాయి. వ్యాపారులు ఒక్కొక్క ప్యాకెట్‌ను రూ. 2వేలకు అమ్ముతున్నారు. ఈ క్రమంలో నకిలీ విత్తన సరఫరాలో వ్యవసాయ అధికారులు, కంపెనీలు కుమ్మక్కై రైతులకు కట్టబెడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో ప్రతియేటా రాష్ట్రంలో 4, 5 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోతున్నారు. నకిలీ విత్తనంతో పంట దెబ్బతింటే దానికి పరిహారం కూడా రైతులకు అందడం లేదు. సదరు కంపెనీలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -