– ఆ రాత్రి ఏం జరిగింది ?
– 100 కు ఫోన్ చేసిన స్పందన కరువు..?
నవతెలంగాణ – భూపాలపల్లి
విద్యార్థినిలకు రక్షణగా ఉండాల్సిన హాస్టల్ గదులు భయానక కేంద్రాలుగా మారుతున్నాయి. విద్యాబుద్ధులు, క్రమశిక్షణ నేర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరాల్సిన చోట అగంతకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. జిల్లా కేంద్రంలోని ఓ బాలికల హాస్టల్‌లో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ రాత్రి ఏం జరిగింది..?
జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఓ బాలికల హాస్టల్ లోకి గత కొన్ని రోజుల క్రితం రాత్రి సమయంలో ఒక అగంతకుడు దొంగచాటుగా హాస్టల్ ఆవరణలోకి ప్రవేశించాడు. అతను నేరుగా ఒక గదిలోకి వెళ్లడం గమనించిన విద్యార్థినిలు బయ బ్రాంతులకు గురై బిక్కు బిక్కుమంటున్నారు. అసలు ఆ అగంతకుడు ఎవరు? లోపలికి ఎందుకు ఎలా రాగలిగాడు? అనే ప్రశ్నలు ఇప్పుడు హాస్టల్ విద్యార్థినిలను వేధిస్తున్నాయి.
100 కు ఫోన్ చేసినా స్పందన కరువు…?
ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారని నమ్మి విద్యార్థినిలు డయల్ 100 కు సమాచారం ఇచ్చారు. కానీ, రక్షణ కల్పించాల్సిన పోలీసుల తీరు విస్మయానికి గురిచేసింది. హాస్టల్ వద్దకు వచ్చిన ఇద్దరు పోలీసులు, కనీసం లోపలికి వెళ్లి విచారణ చేయకుండానే బయట నుండే వెనుదిరగడం వెనుక ఉన్న మర్మమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు…!
రంగంలోకి దిగిన ‘ఆ ఇద్దరు ఎవరు..?
అగంతకుడిని కాపాడేందుకు ఓ ఇద్దరూ గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగారు. అక్కడికి వచ్చిన పోలీసులకు ముడుపులు చెల్లించి, తప్పుదోవ పట్టించి వెనక్కి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అగంతకుడిని తమ వెంట కారులో ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు సమాచారం..
సీసీ కెమెరాలలో రికార్డు అయ్యిందా ?
ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం… ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దొంగలను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయి. అలాంటిది బాలికల హాస్టల్ లో ఉన్న సీసీ కెమెరాల పని తీరు ఏవిధంగా ఉంది ఆరోజు జరిగిన సంఘటన అందులో అస్సలు రికార్డ్ అయిందా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
చూసిన విద్యార్థినీలపై వార్డెన్ దాష్టీకం…
విద్యార్థినిల పై ఆ వార్డెన్ దాష్టీకం ప్రదర్శించింది. అగంతకుడి రాకను గమనించి,గదిలోకి వెళ్లడం చూసి పోలీసులకు సమాచారం అందించిన విద్యార్థినిలను టార్గెట్ చేసిన వార్డెన్ “ఈ విషయం బయటకు చెబితే మీ పని అంతే” అంటూ కొడుతూ, చిత్రహింసలకు గురిచేస్తూ భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం..? వార్డెన్ ప్రవర్తన చూస్తుంటే ఆ అగంతకుడికి ఆమె సహకారం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..? చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు ? జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉండి నిత్యం జనసంచారం ఉండే ఆ హాస్టల్ లో ఇంత తతంగం జరుగుతున్న క్రమం లో పోలీసులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
భయాందోళనలో లో హాస్టల్ విద్యార్థినిలు..
ఆ హాస్టల్ లో అగంతకుడి అడ్డగోలు పనులకు అడ్డగా మారడంతో విద్యార్థినిలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి పూర్తి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
హాస్టల్‌లో అగంతకుడు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



