Wednesday, May 21, 2025
Homeజాతీయంస్పష్టమైన సందర్భం లేకపోతే జోక్యం చేసుకోలేం

స్పష్టమైన సందర్భం లేకపోతే జోక్యం చేసుకోలేం

- Advertisement -

– వక్ఫ్‌ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యలు
– నెమ్మదిగా వక్ఫ్‌ ఆస్తులు లాక్కోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్న సిబాల్‌
– విచారణ నేటికి వాయిదా ొ వాదనలు వినిపించనున్న కేంద్రం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఆమోదించిన ప్రతి చట్టానికి రాజ్యాంగబద్ధత అనే భావన వుంటుందని సుప్రీం కోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రాధమికంగా తేలితేనే చట్టం అమలుపై తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌ పేర్కొన్నారు. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన వందకి పైగా పిటిషన్లపై మంగళవారం సిజెఐ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ ఆగస్టిన్‌ జార్జ్‌ మాసితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద మైనారిటీ గ్రూపు అయిన ముస్లింలకు చెందిన వక్ఫ్‌ ఆస్తులను ఈ కొత్త చట్టం నెమ్మది నెమ్మదిగా లాక్కోవడానికి ఉద్దేశించబడిందని పిటిషనర్లు వాదించారు. మైనారిటీ హక్కులను ఈ కొత్త చట్టం ఉల్లంఘిస్తోందని, వివాదాస్పద వక్ఫ్‌ ఆస్తులను స్తంభింపచేయడానికి అనుమతిస్తోందని, ఇది వివక్షతో కూడినదని వారు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 8న అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్‌ చట్టం అమలుపై స్టే విధిస్తూ తాత్కాలికంగా ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అనే అంశంపై మంగళవారం నాడంతా పిటిషనర్లు చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ న నేతృత్వంలోని బెంచ్‌ విన్నది. స్పష్టమైన సందర్భం తలెత్తకపోతే కోర్టులు జోక్యం చేసుకోలేవని గవాయ్‌ అన్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. అంతకన్నా తాము చెప్పవలసిన అవసరమేమీ లేదన్నారు. వక్ఫ్‌ను స్వాధీనం చేసుకోవడమే ఈ చట్టం ఉద్దేశమని పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ అనడంతో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈనాడు మీరు (పిటిషనర్లు) కేవలం తాత్కాలిక రిలీఫ్‌ కోసమే వాదిస్తున్నారని గవాయ్‌ వ్యాఖ్యానించారు. దానిపై సిబల్‌ స్పందిస్తూ, ప్రాధమికంగా ఉల్లంఘనకు గురైందనుకున్నపుడు రాజ్యాంగబద్ధత భావనను కూడా తిరస్కరించవచ్చని అన్నారు.
ఇటువంటి చట్టం అమలు వల్ల కోలుకోలేని నష్టం జరుగుతుందనుకుంటే న్యాయస్థానం జోక్యం చేసుకుని, ప్రజా ప్రయోజనాల రీత్యా స్టే విధించవచ్చన్నారు. పిటిషనర్ల వాదనలను రోజంతా విన్న ధర్మాసనం తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తన వాదనలను వినిపించనుంది. వక్ఫ్‌ చట్టంపై గత విచారణ (ఏప్రిల్‌ 17న) సందర్భంగా, మూడు అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. వాటిలో వక్ఫ్‌ బై యూజర్‌, వక్ఫ్‌ కౌన్సిల్‌, స్టేట్‌ వక్ఫ్‌ బోర్డులకు ముస్లిమేతరుల నామినేషన్‌, వక్ఫ్‌ కింద ప్రభుత్వ భూముల గుర్తింపు వంటివి ఉన్నాయి. సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌, వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించబోమని, అలాగే ఈ మూడు అంశాలపై వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టుకు గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కాగా, మంగళవారం విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ వక్ఫ్‌ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి విచారణను ఆ మూడు అంశాలకే పరిమితం చేయాలని కోరారు. కోర్టు గుర్తించిన ఆ మూడు అంశాలకు తాము సమాధానం దాఖలు చేశామన్నారు. అయితే ఇప్పుడు పిటిషనర్ల లిఖిత పూర్వక సమాధానాలు ఇతర అంశాలను ప్రస్తావించాయని అన్నారు. ఇందుకు పిటిషనర్ల తరపు హాజరైన సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వి అభ్యంతరం తెలిపారు.
ఈ కేసును విచారించి, మధ్యంతర ఉపశమనం ఎక్కడ ఇవ్వవచ్చో పరిశీలిస్తామని గత సిజెఐ (సంజీవ్‌ ఖన్నా) చెప్పారని, అందువల్ల కేవలం మూడు అంశాలకే తాము పరిమితమవుతామని చెప్పలేమని అన్నారు. వక్ఫ్‌ భూములను లాక్కోవడానికే ఈ చట్టం తెచ్చారని సిబల్‌ వాదించారు. ఎలాంటి ప్రక్రియ లేకుండా వక్ఫ్‌ ఆస్తులను నెమ్మదిగా లాక్కోవడమే ఈ చట్టం ఉద్దేశమన్నారు. కొత్తగా తీసుకువచ్చిన సవరణలు వక్ఫ్‌ ఆస్తులను మెల్ల మెల్లగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ అధికారి విచారణ పేరుతో వక్ఫ్‌ ఆస్తులపై నియంత్రణను తెచ్చుకోవచ్చన్నారు. ఫలితంగా అక్కడ వున్న పాఠశాలలు, ఆస్పత్రులు, మసీదులు వంటి వాటిపై కూడా ప్రభావం పడుతుందన్నారు. ఒక ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించాలంటే ఒక వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే షరతును సిబల్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ”నేను మరణశయ్యపై ఉండి వక్ఫ్‌ ఏర్పాటు చేయాలనుకుంటుంటే ముస్లింగా ఉన్నట్టు రుజువు చేసుకోవాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం” అని అన్నారు. ఇది ఖచ్చితంగా వక్ఫ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకునే చట్టమేనని వాదించారు. వక్ఫ్‌ ఆస్తుల్లో 116శాతం పెరుగుదల వుందనే ప్రభుత్వ వాదనను సింఘ్వి వ్యతిరేకించారు. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు రాజీవ్‌ ధావన్‌, హుజేఫా అహ్మదీ కూడా వాదనలు వినిపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -