నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో అతిపురాతన పర్వత శ్రేణికి చెందిన ఆరావళి పర్వత వ్యవస్థపై.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుచిత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆరావళి పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ప్రక్రియకు అనుమతులు మంజూరు చేస్తూ ఆరావళి పర్వతాల ఎత్తుపై కొత్త నిర్వచనాన్ని పేర్కొంది. అలాగే ఆరావళి పర్వత శ్రేణికి కేంద్రం కొత్తగా నోటిఫై చేసిన నిర్వచనానికి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో వివాదం రాజుకుంది. పర్యావరణ వేత్తలు, సామాజిక వేత్తలు సోషల్ మీడియా వేదికగా సేవ్ ఆరావళి ఉద్యమం పెద్దయెత్తున సాగింది. తాజాగా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఆరావళి పర్వత వ్యవస్థ పరిరక్షణ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఆరావళి పర్వతాల నిర్వచనం , వాటికి సంబంధించి తలెత్తుతున్న వివాదాస్పద అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఒక కొత్త నిపుణుల కమిటీని () ఏర్పాటు చేయాలని ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా (స్వచ్ఛందంగా) విచారణ చేపడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్న రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల స్పందనను కోరుతూ, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పర్వత శ్రేణుల సరిహద్దులను శాస్త్రీయంగా నిర్ధారించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే భూ వివాదాలకు అడ్డుకట్ట వేయాలని ధర్మాసనం భావిస్తోంది.
ఆరావళి పర్వతాలు, పర్వత శ్రేణుల నిర్వచనంపై సుప్రీంకోర్టు తన వైఖరిని మార్చుకుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఆరావళి నిర్వచనాన్ని అంగీకరిస్తూ గతంలో (నవంబర్ 20న) ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేస్తూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ నాటి నిర్ణయం అమలులోకి వస్తే, ఆరావళి ప్రాంతంలో మెజారిటీ భాగం మైనింగ్ కార్యకలాపాలకు అనుకూలంగా మారుతుందని పర్యావరణవేత్తల నుంచి వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.



