నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది. అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఎదురవడంతో వాతావరణ శాఖ ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి వాతావరణం దారుణంగా మారడంతో రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కప్పేసిందని, ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చర్యలు అమల్లోకి వచ్చాయి.
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత సూచీ 403గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. వివేక్ విహార్ (460), ఆనంద్ విహార్ (459), రోహిణి (445), వజీర్‌పూర్ (444) ఏక్యూఐలతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయులు తీవ్రమైన జోన్‌లోకి ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తున్నామన్నారు. విజిబిలిటీ తగ్గిపోవడంతో రైలు, విమాన సర్వీసుల్లో జాప్యం నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు.
తీవ్రమైన పొగమంచు వల్ల రాజధాని ఎక్స్‌ప్రెస్, వందేభారత్, జన శతాబ్దితో సహా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. ఢిల్లీ విమానాశ్రయం సైతం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల రద్దు, ప్రయాణ సమయాల్లో మార్పుల గురించి తెలుసుకోవడానికి తమ అధికారిక వెబ్‌సైట్లను తనిఖీ చేయాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. ప్రయాణికులు విమానాల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం అన్ని విమానయాన సంస్థలకు కస్టమర్ సపోర్ట్ ఫోన్ నంబర్‌లను విడుదల చేసింది.



