నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జనరల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో బంగ్లాదేశ్ వర్కర్స్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న జనరల్ ఎన్నికలను బహ్కిరిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయరని ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, శాంతి భద్రతాలు అదుపులో లేవని, ఎన్నికలు సజావుగా నిర్వహించే పరిస్థితిలేదని బంగ్లాదేశ్ వర్కర్స్ పార్టీ పేర్కొంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం.. మొదట్లో ఎన్నికల ప్రక్రియపై అంచనాలను పెంచినప్పటికీ, తరువాత జరిగిన పరిణామాలు క్రమంగా ఎన్నికలపై అనిశ్చితిని కలిగించాయని వర్కర్స్ పార్టీ చెప్పిందని ది డైలీ స్టార్ తెలిపింది.
హాసినా ప్రభుత్వం పడిపోవడంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. యూనిస్ ఖాన్ నేతృత్వంలో మధ్యంతర సర్కార్ పగ్గాలు చేపట్టారు. కొన్ని నెలలు సజావుగా పరిపాలన సాగినా.. షరీప్ ఉస్మాన్ హాదీ హత్యతో ఒక్కసారిగా బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగాయి. ఆ దేశ రాజధాని ఢాకాలో భారీ స్థాయిలో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హాదీ హత్య కారకులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు పలు చోట్ల నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో పలువురు సామాన్య జనాలతో పాటు మైనార్టీలపై దాడులు జరిగాయి.



