నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారిక నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్‌లతో విరుచుకుపడింది. మాస్కో మరియు సెయింట్ పీటర్స్‌బర్గ్ మధ్య ఉన్న పుతిన్ నివాసంపై ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు 91 డ్రోన్‌లను ప్రయోగించినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఆ డ్రోన్‌లను వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని అన్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అన్నారు. అమెరికాతో చర్చల ప్రక్రియ నుండి వైదొలిగే ఉద్దేశం లేదని, అయితే ఉక్రెయిన్ క్రిమినల్ పాలన క్షీణత కారణంగా ఉగ్రవాదం వైపు మళ్లిందని అన్నారు. దీంతో శాంతి ప్రక్రియలో ‘రష్యా చర్చల స్థానం’ సవరించబడుతుందని అన్నారు.
అయితే పుతిన్ అధ్యక్ష నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడిని వ్యాఖ్యలను అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. సుమారు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తాను చేసిన భాగస్వామ్య ప్రయత్నాలను రష్యా వాదన అణిచివేసిందని ఆరోపించారు.
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ దాడిపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారని, ఇటువంటి నిర్లక్ష్యపు చర్యను తాను ఊహించలేనని ట్రంప్ పేర్కొన్నట్లు రష్యా విదేశాంగ విధాన సలహాదారు యూరి ఉషకోవ్ తెలిపారు.
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందనే వార్తలపై ప్రధాని మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని రెండు దేశాలను కోరారు.



