నవతెలంగాణ-హైదరాబాద్: మన ఊరు మన బడి కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మన ఊరు మన బడి (MOMB) కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు విడుదల చేయకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.
తెలంగాణలో మన ఊరు మన బడి కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసే రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా,కమీషన్లు రావు అని బిల్లులు ఇవ్వడం లేదా అని ఆరోపించారు.మన ఊరు మన బడి కార్యక్రమానికి చెందిన రూ.512కోట్ల రెడీ ఫర్ పేమెంట్ ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు.
బుధవారం హైదరాబాదులోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి వచ్చి మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు. అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్నామని, కుటుంబాలు నడవడం కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా హరీష్ రావు అసెంబ్లీ వేదికగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల సమస్యలు లేవనెత్తుతానని వారికి భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలని, తద్వారా అడ్మిషన్లు పెంచి పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని కేసీఆర్ గారు ఆలోచిస్తే, రేవంత్ రెడ్డి ఆ లక్ష్యాన్ని నీరుగా అరుస్తున్నారని ఈ సందర్భంగా హరీశ్ రావు మండిపడ్డారు.మన ఊరు మన బడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే వరకు బిఆర్ఎస్ పోరాడుతుందన్నారు.విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి కి రాష్ట్రంలో విద్య పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. గురుకులాల పిల్లలకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేని చేతగాని సర్కారు అని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోతున్నారు. ఒకవైపు బ్యాంకు వడ్డీలు, మరోవైపు కార్మికుల జీతాలు, సరఫరాదారుల బాకీలు—అన్ని కలిపి కాంట్రాక్టర్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లను పట్టించుకోకపోవడం, చేసిన పనులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు.



