నవతెలంగాణ-హైదరాబాద్: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఢిల్లీలోని వాయు భవన్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వీర జవాన్లకు నివాళులర్పించారు.
కాగా, ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. 1985 డిసెంబర్‌లో ఆయన పాస్‌అవుట్ అయ్యారు. 1986 డిసెంబర్ 6న వైమానిక దళానికి చెందిన ఫ్లయింగ్ బ్రాంచ్ ఫైటర్ స్ట్రీమ్‌లో నియమితులయ్యారు. నిష్ణాతుడైన ఫైటర్ పైలట్, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఫైటర్ కంబాట్ లీడర్‌గా ఆయన గుర్తింపు పొందారు. మిగ్-21, మిగ్-29 విమానాలతో సహా పలు యుద్ధ విమానాలను నడిపారు. నాలుగు దశాబ్దాల పాటు దేశానికి విశిష్ట సేవలందించి బుధవారం పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ నరమదేశ్వర్ తివారీ స్థానంలో ఆయన నియమితులయ్యారు.



