నవతెలంగాణ-హైదరాబాద్: ఇండోర్‌లో కలుషిత నీరు తాగి పదుల సంఖ్యలో పలువురు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాదంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. మురికిగా, దుర్వాసన వస్తోన్న నీటి గురించి గతంలో ప్రజలు పదే పదే ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? తాగే నీటిలో మురుగునీరు ఎలా కలిసింది? వెంటనే నీటి సరఫరా ఎందుకు ఆపలేదు? బాధ్యులైన అధికారులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? అని రాహుల్ ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఇంత దారుణం జరుగుతుంటే బీజేపీ ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతుందని ఎద్దేవా చేశారు పరిశుభ్రమైన నీరు పొందడం ప్రజల హక్కు అని అన్నారు. ఈ హక్కును కాలరాసిన బీజేపీ ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు.
దుష్పరిపాలనకు మధ్యప్రదేశ్ కేంద్రంగా మారిందని విమర్శించారు. మొన్నటి వరకు దగ్గు మందు కారణంగా, ఆ తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకల వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇప్పుడు కలుషిత నీరు కారణంగా మృతి చెందుతున్నారన్నారు. ఇలా ఎప్పుడు పేదలు మరణించినా.. మోదీజీ మాత్రం మౌనంగానే ఉంటారని విమర్శించారు.



