సింగరేణిని ముంచిందే కాంగ్రెస్‌

Congress drowned Singareni– ఆ పార్టీకి ఢిల్లీలో బాస్‌లు.. బీఆర్‌ఎస్‌కు ప్రజలే బాస్‌లు
– సింగరేణి ప్రయివేటీకరణకు కేంద్రం యత్నం
– ఎన్నికల్లో బీసీలు తమ చైతన్యాన్ని చూపించాలి
– ధరణితో దళారీ వ్యవస్థ లేకుండా చేశాం
– పార్టీల చరిత్ర, ఎవరికి ఓటేస్తే లాభమో చూడాలి :ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి/ మంథని/పెద్దపల్లి
తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణికి 144 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ సంస్థను ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుప చేతకాక ముంచిందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు, కార్మికుల కష్టంతో రూ.2184కోట్ల లాభాల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. దసరా, దీపావళి పండుగలకు రూ.వెయ్యికోట్ల బోనస్‌ పంపిణీ చేసినట్టు వివరించారు. సింగరేణిలో 45వేల మందికి ఇండ్ల స్థలాలకు పట్టాలు జారీ చేశామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం డిపెండెంట్‌ ఉద్యోగాలు పోగొడితే.. తమ ప్రభుత్వం ఇప్పటివరకు 19,400 ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. పార్టీలు, వ్యక్తులు వారి చరిత్ర, నడవడికలను పరిశీలించి ఓటు వేయాలని, ఏ పార్టీకి వేస్తే లాభం జరుగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో మంగళవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాధ సభల్లో సీఎం పాల్గొని మాట్లాడారు.
ఉద్యమకారుడు, నిఖార్సైన వ్యక్తిత్వం కలిగిన చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను గెలిపించాలని మందమర్రి సభలో కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. సింగరేణి చైతన్యం కలిగిన ప్రాంతమన్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలే బాస్‌లని.. ఢిల్లీలో ఉండరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీకి ప్రయివేటీకరణ పిచ్చిపట్టిందని విమర్శించారు. సింగరేణిని ప్రయివేటీకరించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రైతులపై ఏమాత్రం ప్రేమలేదని, ధరణి పోర్టల్‌ను తీసేస్తామని చెబుతున్నారని, అది పోతే.. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు వస్తాయా అని ప్రశ్నించారు. అంబేద్కర్‌ను పార్లమెంటుకు సైతం వెళ్లకుండా కాంగ్రెస్‌ ఓడిస్తే, బీఆర్‌ఎస్‌ మాత్రం 125 అడుగుల ఎత్తైన విగ్రహం పెట్టి గౌరవించిందని గుర్తుచేశారు. సచివాలయానికి ఆయన పేరు పెట్టామన్నారు. జిల్లాలో కొందరు కాంగ్రెస్‌ నాయకులు సూట్‌కేసులతో ప్రజలను ఏమార్చేందుకు వస్తున్నారని, అలాంటి నాయకులకు ఓటేస్తారా.. లేక నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే బాల్క సుమన్‌కు గెలిపిస్తారా అనేది ఆలోచించాలని సూచించారు. అంతకుముందు కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్‌, డా.రాజారమేష్‌.. సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. సభలో మాజీ స్పీకర్‌ మధుసూదనచారి, ఎంపీ వెంకటేష్‌ నేత, ఎమ్మెల్సీలు రఘోత్తమ్‌రెడ్డి, దండె విఠల్‌, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్‌, టీబీజీకేఎస్‌ నాయకులు కెంగర్ల మల్లయ్య, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల గోసకు కాంగ్రెస్సే కారణం
పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల సభల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 50 ఏండ్ల గోసకు కారణం కాంగ్రెస్‌ పార్టీయేనని, సమైక్య పాలకులు తెలంగాణను ఊడకొట్టి ఆంధ్రప్రదేశ్‌లో కలిపి మనల్ని ఇబ్బంది పెట్టారన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుందన్నారు. వందలాదిమంది పిల్లలు తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటే తప్ప అనాటి కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణ ఇచ్చిందుకు ముందుకు రాలేదని తెలిపారు. బీసీలకు అవకాశం రావడం లేదని అంటున్నారని, అవకాశం వచ్చినకాడ చైతన్యం ఏమైందని ప్రశ్నించారు. మీ కోసం బీసీ బిడ్డ పుట్ట మధుకు అవకాశం వచ్చింది.. ఇప్పటికైనా మీ చైతన్యాన్ని ఈ ఎన్నికల్లో చూపించి మధును గెలిపించాలని కోరారు. పదేండ్ల తెలంగాణ ప్రశాంతంగా ఉన్నదని, రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు, లొల్లి లేదని పెద్దపల్లి సభలో అన్నారు.

Spread the love