– ఎన్ని నోటీసులు ఇచ్చినా దూది పింజలే..
– ప్రజల పాలన కాస్తా కమీషన్ల పాలనగా మారింది : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌కు కమీషన్ల పేరుతో నోటీసులు జారీ చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నల్లగొండ పట్టణంలోని ఎంఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో బుధవారం ఒక వివాహానికి హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, కెేసీఆర్‌కు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయని అన్నారు. తెలంగాణ కోసం కష్టపడిన వారికి దేవుడు అండగా ఉంటాడని, న్యాయం, ధర్మం గెలుస్తుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. కమీషన్‌లు తీసుకోనిదే పనులు జరగడం లేదని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే చెబుతున్నారని అన్నారు. కమీషన్లు తప్ప ప్రభుత్వానికి పాలన చేతకాదని విమర్శించారు. కాంట్రాక్టర్లు సచివాలయంలోనే ధర్నా చేయడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చిత్రీకరించేందుకు కుట్రలు చేస్తూ కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణం కోల్పోయి నేటికి 3 నెలలు అవుతున్నా మృతదేహాలను వెలికితీయలేదు.. సమర్ధుడైన ముఖ్యమంత్రి ఉంటే మృతదేహాలను బయటకు తీసుకొచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయిందని విమర్శించారు. మీ కమీషన్‌ల ఆరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి కూడా సాహసం చేయలేకపోయారన్నారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని విమర్శించారు. నల్లగొండలో సుంకిశాల ప్రాజెక్ట్ కూలింది.. ఇప్పటికీ సంస్థ మీద ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. వడ్డేం పంప్‌హౌస్ మునిగింది.. దానిమీద చర్యలు లేవన్నారు. పెద్ద వాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయినా చర్యల్లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంద న్నారు. కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలు రూ.2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారని, ఇచ్చిందాక తాము అడుగుతూనే ఉంటామని అన్నారు. ఆరు గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది అని విమర్శించారు. 17 నెలల నుంచి చిల్లర వేషాలే.. ఈ త్రీడీ మంత్రం ఎక్కువ రోజులు నడవదని అన్నారు. ఆయన వెంట సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌కు నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES