నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ దేశంలో పలు రోజులు ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. అతిదారుణంగా ఆ దేశ కరెన్సీ విలువ పడిపోవడంతో పాటు పాలనలో మతాధికారుల జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఇరానీయులు రోడ్డెక్కారు. గత రాత్రి జరిగిన నిరసన ప్రదర్శనలు హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులతో పాటు పలు ప్రయివేటు భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. నిరసన కారులను అదుపు చేయడానికి భద్రతా బలగాలు కాల్పులు జరపగా..పలువురు మృతి చెందారు.
ఈక్రమంలోనే తాజాగా ఆందోళనకారులను ఉద్దేశిస్తూ ఇరాన్ సుప్రీం అయాతుల్లా ఖమేని శుక్రవారం మాట్లాడారు. తమ దేశ సంక్షోభానికి అమెరికా కారణమని, భారీ హింసాత్మక అల్లర్ల వెనుక యూఎస్ హస్తముందని ఆరోపించారు. అదే విధంగా కొంతమంది ఆందోళనకారులు యూఎస్ ను సంతోషంగా ఉంచడానికి అల్లర్లను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన దేశంలో(అమెరికా) అనేక సంఘటనలు జరుగుతున్నాయని, ముందు వాటిని అదుపు చేయాలని పరోక్షంగా ట్రంప్ కు చురకులు అంటించారు. ట్రంప్ నిరంకుశుడిగా వ్యవహరిస్తున్నారని, నిరంకుశులు తమ అహంకార శిఖరాగ్రంలో ఉన్నారని అన్నారు. తమ దేశంలో విదేశీయుల కోసం కిరాయి సైనికులను సహించమని హెచ్చరించారు.



