నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మెక్సికోపై బెదిరింపులకు దిగారు. మెక్సికోపై సైనికచర్యలను చేపట్టనున్నట్లు గురువారం ట్రంప్ ప్రకటించారు. డ్రగ్స్ అక్రర రవాణాను అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణాను, ముఖ్యంగా మెక్సికో నుండి వచ్చే ఫెంటానిల్‌ను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆరోపిస్తున్నారు. దక్షిణ సరిహద్దు దాటి అమెరికా సైన్యాన్ని మోహరించనున్నట్లు తెలిపారు.
ఈ ఆరోపణలను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఖండించారు. ట్రంప్ వైఖరిని తిరస్కరించారు. మెక్సికో సార్వభౌమదేశమని, దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సార్వభౌమాధికారం పట్ల గౌరవం, చర్చలు, సహకారం ఆధారంగా దేశాల మధ్య సంబంధాన్ని సమర్థిస్తామని, ఆంక్షలు విధించడం లేదా సైన్యాన్ని వినియోగించడాన్ని కాదని ఈనెల 5న మీడియా సమావేశంలో ఆమె స్పష్టం చేశారు.
ఈ నెల ప్రారంభంలో వెనిజులాపై అమెరికా దురాక్రమణ దాడులకు దిగిన సంగతి తెలిసిందే. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను కిడ్నాప్ చేసి, న్యూయార్క్ జైలుకి తరలించింది.



