నవతెలంగాణ-హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లో ఓ ప్రయివేటు బస్సు బోల్తాపడి ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం సిర్మౌర్ జిల్లాలో జరిగింది. బస్సు కుప్వి నుంచి సిమ్లాకు వెళుతుంది. 30- 35 మంది ప్రయీణీకులతో వెళుతున్న బస్సు హరిపుర్దార్ మార్కెట్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి 60 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణీకులు మృతి చెందారు.
ఈ ఘటనకు సంబంధించి సిర్మౌర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ నిశ్చింత్ సింగ్ నేగి మీడియాతో మాట్లాడుతూ.. ‘సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. బహుశా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు, రెస్క్యూ బృందాలు క్షతగాత్రుల్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట ఈ ప్రమాదం జరిగిన వెంటేనే స్థానికులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ తర్వాత రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం అత్యాధునిక సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించారు’ అని ఆయన అన్నారు.



