నవతెలంగాణ హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగం చేపట్టింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘ఈఓఎస్-ఎన్1’ లేదా ‘అన్వేష’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి తీసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకొని ఉదయం 10.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో పాటు భారత్, యునైటెడ్ కింగ్‌డమ్, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలు కూడా ఈ రాకెట్‌లో ఉన్నాయి. 2026లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే.
న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) చేపట్టిన 9వ పూర్తిస్థాయి వాణిజ్య మిషన్ ఇది. ఈ మిషన్‌లో ప్రధాన ఉపగ్రహం ఈఓఎస్-ఎన్1. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం, సరిహద్దుల్లో నిఘాకు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఉపయోగపడనుంది.


