నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన నాలుగో సంవత్సరం విద్యార్థినులు.. జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాలకు తరలి వచ్చారు. మూడేళ్ల పాటు తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా.. రైతులతో కలిసి పని చేస్తారు. 46 మంది విద్యార్థినులు జిల్లాలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తొమ్మిది జట్లుగా ఏర్పడి.. తొమ్మిది గ్రామాలకు చేరుకున్నారు. బొమ్మాయిపల్లి(6), తాజ్పూర్(6), అనాజిపురం(4), వడాయిగూడెం(5), చందుపట్ల(5), ముత్తిరెడ్డిగూడెం(5), బొల్లేపల్లి(5), వలిగొండ మండలం టేకుల సోమారం(5), రాజపేట(5) మండల కేంద్రంలో నివాసం ఏర్పరుచుకున్నారు. ఐదు నెలల పాటు రైతులతో కలిసి దుక్కి దున్నడం, విత్తనాలు విత్తటం, నాటు వేయడం నుంచి కోతలు పూర్తయ్యే వరకు శిక్షణ పొందుతారు.
దీనిలో భాగంగా వ్యవసాయ విద్యార్థినులు గ్రామీణ భాగస్వామ్య విశ్లేశణాత్మక తులనం కార్యక్రమం పూర్తి చేశారు. జనవరి 3 నుండి 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం పూర్తి చేశారు. ముఖ్యంగా వారు ఉంటున్న గ్రామాలలోని వనరులు, నేలలు, పండించే పంటలు, సమస్యలు మరియు వాటి పరిష్కారాలను సూచించే వివిధ పటాలను రూపొందించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమానికి రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా.డి. శ్రీలత, యంగ్ ప్రోఫెషనల్స్ ఎమ్.వేణు, ఆర్.రూప, జి.భాను, పి.రాజేష్ మరియు గ్రామ పాలకవర్గ సభ్యులు, అభ్యుదయ రైతులు, ఎన్జీవో ఆర్గనైజేషన్ సభ్యులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.



